పెద్దిరెడ్డికి ఎందుకింత కక్కుర్తి!

Friday, December 5, 2025

అధికారంలో ఉండే పెద్దలు అంతో ఇంతో తప్పుడు పనులు చేయకుండా ఉంటారని అనుకోవడం భ్రమ. చిన్న చిన్న భూ ఆక్రమణలు వంటివి చాలా సాధారణం. ఎలాంటివంటే.. తమ ఇంటికి ఆనుకుని ప్రభుత్వ స్థలం ఉంటే దాన్ని కూడా కలిపేసుకుంటూ ప్రహరీ కట్టుకోవడం లాంటి తప్పులు చాలామంది చేస్తుంటారు. కానీ ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటి తప్పుల భరతం పడుతుంటారు. కానీ చిత్తూరుజిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ అగ్ర నాయకుడు, జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన కేబినెట్లో అంతటి కీలక నాయకుడిగా గుర్తింపు ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహార సరళి మాత్రం భిన్నంగా, మరీ ఘోరంగా కనిపిస్తోంది. ఇలాంటి చిల్లరమల్లర ఆక్రమణలు కాదు.. కబ్జాల కోసమే కబ్జాలు అన్నట్టుగా  ఆయన చెలరేగిపోయిన తీరు ఇప్పుడు కేసులదాకా వచ్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఆయన కుటుంబసభ్యుల మీద అటవీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది.

చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళం పేటలోని అటవీ భూములను 28 ఎకరాల మేర కబ్జా చేసినట్టుగా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ నివేదికలు ఈ కబ్జాలు నిజమేనని తేల్చడంతో.. అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కబ్జా భూముల్లో పెద్దిరెడ్డి విశాలమైన, విలాసవంతమైన అతిథిభవనాలు కట్టుకున్నారు. అయినా ఎంతో సంపన్నుడు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఒక గెస్ట్ హవుస్ కట్టుకోవాలనుకుంటే.. అటవీ భూములనే ఆక్రమించాలా.. ఆయనకు మరో దారి లేదా, సొంతంగా భూములు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారా? ఆయనకు ఎందుకింత కక్కుర్తి? ఆ కారణంగా ఇప్పుడు కుటుంబసభ్యులందరూ కేసు పాలయ్యారు.. అని ప్రజలు అనుకుంటున్నారు.

అటవీ భూముల కబ్జా, అనుమతిలేకుండా బోరు వేయడం, జీవ వైవిధ్యానికి తదితర చట్టాల కింద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ఆయన కొడుకు మిథున్ రెడ్డి, తమ్ముడు ద్వారకనాధరెడ్డి, మరదలు ఇందిరమ్మ మీద కేసు నమోదు అయింది. పెద్దిరెడ్డి రాజకీయాల్లో అడుగుపెట్టక ముందునాటినుంచే బాగా డబ్బున్నవాళ్లు. పెద్దస్థాయి కాంట్రాక్టర్లుగా వారికి పేరుంది. కోట్లకొద్దీ ఆర్జించారు. అయితే జగన్ అధికారంలో ఉన్న రోజుల్లో ఎలా చెలరేగినా పరవాలేదు.. తమను అడిగే దిక్కులేదు అనే మితిమీరిన విచ్చలవిడితనం కారణంగానే ఈ ఆక్రమణలకు పాల్పడినట్టు తెలుస్తోంది.

కేవలం అటవీ భూములు మాత్రమే కాదు.. ఇంకా ప్రభుత్వ భూములు, తిరుపతి సమీపంలో బుగ్గమఠం భూములను కూడా ఆక్రమించిన కేసులు ఆయన మీద ఉన్నాయి. మరి రాజకీయ వేధింపుల్లో భాగమే కేసులు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఆయన ఈ కేసుల నుంచి ఎలా ఎప్పటికి బయటపడతారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles