‘‘అమ్మాయిల అక్రమ రవాణా, డ్రగ్స్ సరఫరా తప్ప మా కుటుంబం మీద అన్ని రకాల కేసులు పెట్టారు. అన్నీ అబద్ధపు కేసులు. ఏ ఒక్కటి కూడా నిరూపించలేరు’’ అని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చాలా గట్టిగానే ప్రగల్భాలు పలికారు.
‘‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో తగాదాలు ఉన్నాయి. అప్పటి కక్ష్లలను తీర్చుకోవడానికే ఆయన ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం మీద అక్రమ కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారు’’ అని సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రవచించారు.
వీరు ఎలాంటి కవ్వింపు ఆరోపణలు చేస్తున్నప్పటికీ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాత్రం నోరుమెదపనే లేదు. ఈ వ్యాఖ్యలు తనకేమీ పట్టవన్నట్టుగా ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు. అయితే ఇలాంటి కువిమర్శలతో చంద్రబాబు మీద బురద చల్లడానికి ప్రయత్నించే మిథున్ రెడ్డి, జగన్ రెడ్డి తదితరులు సరదాను ఇప్పుడు పవన్ కల్యాణ్ తీర్చేస్తున్నారు. ప్రభుత్వం మీద ముందే ఇలాంటి నిందలు వేస్తే.. తమ మీద చర్యలు తీసుకోవడానికి జంకుతారనే దురాలోచనలతో పెద్దిరెడ్డి అండ్ కో ప్రవర్తిస్తుండవచ్చు గానీ.. పవన్ కల్యాణ్ చాలా పక్కాగా విజిలెన్న్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీతో విచారణ జరిపించి మరీ.. పెద్దిరెడ్డి కుటుంబ అక్రమాలను, అరాచకాలను నిగ్గుతేల్చి.. డీజీ సిఫారసుల మేరకు వారి కుటుంబంపై క్రిమినల్ కేసులు, అటవీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో చాలా సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగించిన రోజుల్లో ఆయన జిల్లాను మొత్తం తన గుప్పిట పట్టుకుని ఉన్నారు. ఆయన మాటకు ఎదురులేదన్నట్టుగా సాగింది. అటవీ భూములను, ప్రభుత్వ భూములను, బుగ్గమఠం భూములను.. ఇలా తన కన్నుపడితే చాలు.. ఏ భూములనైనా సరే ఆక్రమించేయడం అనేది ఆయనకు అలవాటుగా మారిందనే విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ భూఆక్రమణల ఆరోపణల మీద విచారణ చేయించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా విజిలెన్న్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీతోనే విచారణ చేయించారు. ఆయన క్రిమినల్ కేసులుపెట్టడంతో పాటు, పెద్దిరెడ్డి యథేచ్ఛగా ఆక్రమణలు చేస్తూ ఉండగా.. ఊరుకుండిపోయిన అప్పటి అధికారులను కూడా బాధ్యులను చేయాలని తన నివేదికలు స్పష్టం చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆమేరకు ఆదేశాలు ఇచ్చారు.
పెద్దిరెడ్డి మీద కేసులు పెడుతున్నారని గోల చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తాము సచ్ఛీలురమే అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్లూ ఎన్ని ఆరోపణలు వచ్చినా.. డాక్యుమెంట్లు చూపించకుండానే.. దబాయిస్తూ వచ్చిన పెద్దిరెడ్డి అండ్ కో ఆటలు ఇక సాగవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మిథున్, జగన్ సరదా తీర్చేయనున్న పవన్!
Friday, December 5, 2025
