వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లికి బిచ్చం పెట్టని వ్యక్తిగా ఆయన పార్టీ నాయకులే చెప్పుకుంటూ ఉంటారు. అయితే వేరే వాళ్లు చేసే సేవా కార్యక్రమాల మీద బురద చల్లడానికి మాత్రం ఆయన దళాలు సదా సిద్ధంగా ఉంటాయేమో అనిపిస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తోంటే… తమ చేతుల్తో ఒక్క మంచి పనిచేయరు సరికదా.. మంచి పనులు చేసే వారిని కూడా నిందిస్తూ కుటిల నీతిని ప్రదర్శించడం వైసీపీ వారికి అలవాటు అయిపోయిందేమో అనిపిస్తోంది. నారాలోకేష్ మంగళ గిరి నియోజకవర్గంలో మహిళలకు పసుపు రంగుతో ఉన్న కుట్టు మిషన్లను పంపిణీ చేసిన కార్యక్రమం గురించి ప్రచారం చేయడంద్వారా వైసీపీ తమ కుటిలత్వాన్ని బయట పెట్టుకుంటోంది.
విషయం ఏంటంటే.. నారా లోకేష్ మహిళలకు పసుపు రంగు గల కుట్టు మిషన్లు పంపిణీ చే స్తున్న ఫోటోలను వైసీపీ ప్రచారంలో పెట్టింది. ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తమ తెలుగుదేశం పార్టీ రంగులు ఉన్న మిషన్లు ఇస్తున్నారంటూ బురద చల్లే ప్రయత్నం చేసింది. అయితే ఈ వైఖరిపై లోకేష్ మాత్రం విరుచుకుపడ్డారు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ ఎదురు దాడికి దిగారు.
తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. నియోజకవర్గంలోని పేద మహిళల గురించి ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు అనే ఉద్దేశంతో.. తన సొంత డబ్బుతో అందరికీ కుట్టుమిషన్లు ఇచ్చినట్టుగా లోకేష్ వెల్లడించారు. జగన్ లాగా ప్రభుత్వ సొమ్ముతో కార్యక్రమాలు నిర్వహించి పార్టీ రంగులు వేసుకునే కక్కుర్తి తనకు లేదని ఆయన ఎదురుదాడి చేయడం విశేషం. 2022 లో తాను పంపిణీ చేసిన కుట్టు మిషన్ల ఫొటోలను ఇప్పుడు ప్రచారంలో పెట్టారని అన్నారు.
వైసీపీ సాగిస్తున్న ఈ దుష్ప్రచారం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి పిల్లికి బిచ్చం పెట్టే రకం కాదని.. ఆయన ఇతరులు చేసే సేవ మీద నింద వేస్తారని అంటున్నారు. కనీసం విజయవాడలో వరదలు ముంచెత్తిన సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి తాను కోటిరూపాయలు సాయం చేస్తున్నట్టు ప్రకటించారే తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ సాయం పార్టీ నుంచి అందుతుందని అన్నారు. కానీ పార్టీ నిధుల నుంచి కూడా కోటి కాదు కదా..రూపాయి కూడా ఇవ్వలేదు. విజయవాడలోని స్థానిక నాయకులనే సహాయక పనులు చేయాలని అన్నారు. వారు కొన్ని చోట్ల అన్నదానాలు, వాటర్ బాటిళ్ల పంపిణీ చేసి.. కోటికి పైగా ఖర్చు పెట్టేసినట్టు చెప్పుకున్నారు. అంతటి కక్కుర్తిగా వ్యవహరించే నాయకుడి పార్టీ.. నారా లోకేష్ స్వచ్చందంగా తన సొంత డబ్బుతో మహిళలకు కుట్టు మిషన్లు ఇస్తే వాటి గురించి కూడా తప్పుడు ప్రచారం చేయడం అసహ్యకరం అని ప్రజలు అనుకుంటున్నారు.
పిల్లికి బిచ్చం పెట్టని జగన్ కుటిలనీతికి.. పరాకాష్ట!
Thursday, December 11, 2025
