తమిళ సినిమాల్లోకి అడుగు పెట్టేందుకు సుహాస్ కూడా రెడీ అయ్యాడు. ఇప్పటి వరకు తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ నాచురల్ యాక్టర్, ఇప్పుడు తమిళంలో ఓ ప్రత్యేకమైన పాత్రతో పరిచయం అవుతున్నాడు. సూరి హీరోగా నటిస్తున్న “మండాడి” అనే సినిమాలో సుహాస్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇదే సినిమా రెండు భాషల్లో తెరకెక్కుతోంది. తమిళంలో సూరి హీరోగా వస్తే, సుహాస్ విలన్‌గా కనిపించనున్నాడు. కానీ మొదట్లో తెలుగు వర్షన్లో మాత్రం పాత్రలు రివర్స్ అవుతాయంటూ కొన్ని వార్తలు వినిపించాయి. అంటే తెలుగు వెర్షన్లో సుహాస్ హీరోగా, సూరి విలన్‌గా వస్తారన్న మాట.
ఈ మధ్య వచ్చిన ఈ గాసిప్స్‌కి సుహాస్ స్వయంగా స్పందిస్తూ, తాను రెండు భాషల వర్షన్లలో కూడా ప్రతినాయకుడిగానే నటిస్తున్నానని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఈ వార్తలన్నీ గాలికి వదిలేసినట్టయింది.
ఈ సినిమా కోసం సుహాస్ ఎంచుకున్న నెగటివ్ రోల్ అతని కెరీర్‌కు మలుపు తీసుకురావొచ్చనే చెబుతున్నారు. ఇక రెండు భాషల్లోనూ నటించడం వలన ఆయనకు పాన్ ఇండియా గుర్తింపు రాబట్టే ఛాన్స్ కనిపిస్తోంది.
సుహాస్ కొత్త ప్రయోగంగా చేస్తోన్న ఈ విలన్ పాత్ర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆశ్చర్యపరిచే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
