పోలీసులు కేసు నమోదుచేసి విచారణకు పిలిచినప్పుడు రాజకీయ నాయకులు దానిని ఎగ్గొట్టడానికి, తద్వారా సంచలనాలు సృష్టించడానికి ప్రయత్నించడం చాలా సహజం. కానీ.. ఒక సంస్థలో ఉద్యోగి.. కేవలం వివరాలు తెలుసుకోవడం కోసం పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని పిలిస్తే.. హాజరు కాకుండా వారిని ముప్పుతిప్పలు పెట్టడం చిత్రంగా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పాపిరెడ్డి పల్లి పర్యటనకు వెళ్లినప్పుడు.. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ కు పైలట్ అయిన అనిల్ కుమార్ పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా విచారణను నానుస్తుండడం కొత్త అనుమానాలకు దారితీస్తోంది. వైఎస్సార్ సీపీ నాయకులు మాత్రమే కాదు, ఆ పార్టీ కోసం పనిచేసే ఇతర సంస్థల ఉద్యోగులు కూడా.. జగనన్న కళ్లలో ఆనందం కోసం రాజకీయ తెలివితేటలను ప్రదర్శిస్తుంటారా? అనే అభిప్రాయం కలుగుతోంది.
పాపిరెడ్డి పల్లికి జగన్ వెళ్లినప్పుడు పోలీసులు వద్దని ఎంతగా వారిస్తున్నప్పటికీ స్థానిక నాయకులు కార్యకర్తలందరినీ హెలిపాడ్ వద్దకు తోలించారు. అక్కడ తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్లు రెచ్చగొట్టే మాటలు అనడంతో.. కార్యకర్తలు పోలీసుల మీద రాళ్లదాడికి పాల్పడడం కూడా జరిగింది. ఈ క్రమంలో హెలికాప్టర్ చుట్టూ జనం ఎగబడడం వంటి అనేక పరిణామాల నేపథ్యంలో హెలికాప్టర్ కొద్దిగా దెబ్బతింది. అది దెబ్బతిన్నది గనుక.. వీఐపీ ని అందులో తీసుకువెళ్లడం సాధ్యం కాదని పైలట్ అనిల్ కుమార్ చెప్పేశారు. దాంతో జగన్ రోడ్డు మార్గాన బెంగుళూరుకు వెళ్లిపోయారు. ఆయన బయల్దేరిన కొద్దిసమయానికే హెలికాప్టర్ కూడా గాల్లోకి ఎగిరి, ఎంచక్కా బెంగుళూరు వెళ్లిపోయింది.
ఇక్కడే అనేక సందేహాలు తలెత్తాయి. అంత హాయిగా ఫ్లై అయిన హెలికాప్టర్ జగన్ ను మాత్రం ఎందుకు తీసుకువెళ్లలేకపోయింది అనే సందేహాలు కలిగాయి. దానికితోడు.. జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో ప్రయాణించేలా చేయడానికే హెలికాప్టర్ మీద ప్రభుత్వం దాడిచేయించింది.. దెబ్బతినేలా చేసింది.. రోడ్డుమార్గంలో జగన్ వెళ్తుండగా ఆయనను చంపించడానికి ప్లాన్చ చేశారు… వంటి పసలేని చెత్త విమర్శలతో వైసీపీ నేతలు కొన్ని రోజుల పాటూ రెచ్చిపోయారు. చిరాకు పుట్టిన ప్రభుత్వం హెలికాప్టర్ వ్వవహారంలో విచారణకు ఆదేశించింది. కో పైలట్ శ్రేయాస్ జైన్ విచారణకు న్యాయవాదితో సహా వచ్చి తనకు తెలిసిన వివరాలు చెప్పి వెళ్లారు. పైలట్ అనిల్ కుమార్ మాత్రం.. విచారణకే రాకుండా నాటకాలు ఆడుతుండడం పోలీసులకు అనుమానాలను పెంచుతోంది.
గతంలో విచారణకు పిలిస్తే అనిల్ కుమార్ సెలవులో ఉన్నాను రాలేనన్నారు. మే2న రావాలని మళ్లీ నోటీసులు పంపగా హాజరు కాలేదు. వర్చువల్ గా హాజరవుతానని సమాచారం పంపడంతో అలా కుదరదని నేరుగా విచారణకు రావాల్సిందేనని పోలీసులు చెప్పారు. మరోసారి నోటీసులు పంపబోతున్నారు. నిజానికి ఇదేమీ పైలట్ నేరం చేసినట్టుగా ఉన్న నేరం కాదు. కానీ ఆయన విచారణను తప్పించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు గమనిస్తే.. ఏదో గూడుపుఠాణీ జరిగినట్టుగానే ప్రజలు అనుమానిస్తున్నారు.
వైసీపీ నేతలను మించిపోతున్న జగనన్న పైలట్!
Friday, December 5, 2025
