ముస్లిం మదర్సాలలో సాధారణంగా మతపరమైన విద్యాబోధన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన సాగుతుంది. అయితే మతపరమైన విషయాలే ప్రధానంగా బోధిస్తుండడం వలన.. వారు ఇస్లాం మతపరమైన, ఉర్దూ భాషాపరమైన ఉద్యోగాలకు మాత్రమే అర్హులవుతూ ఉంటారు. అలాంటి పనుల్లోనే స్థిరపడుతూ ఉంటారు. అయితే ఇదే మదర్సాలలో సాధారణ ఆధునిక విద్యాబోధన కూడా అందుబాటులో ఉంటే.. వారు అందరితోనూ పోటీపడగలిగే విద్యార్జన చేయడం సాధ్యమవుతుంది. ఈ ఆలోచనతోనే చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ‘చంద్రన్న మదర్సా నవీన విద్యాపథకం’ గా పిలిచేపథకం ద్వారా.. గుర్తింపు పొందిన ప్రతి మదర్సాలోనూ ముగ్గురు విద్యావాలంటీర్లను నియమించి.. వారి ద్వారా ఇంగ్లిషు, మాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ కూడా మదర్సాల్లోని పిల్లలకు నేర్పాలని నిర్ణయించారు. ఇలాంటి నిర్ణయం వలన ముస్లిం విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. వారందరూ కూడా ఇంటర్మీడియట్ వరకు మతపరమైన ఖురాన్ విద్యలతో పాటు, సాధారణ ఆధునిక నవీన విద్యను కూడా నేర్చుకుంటారు. దీనివలన.. ఆ తరువాత వారి ఎదుగుదలకు అన్ని రకాల అవకాశాలు సజీవంగా ఉంటాయి. మతపరమైన వృత్తులు, ఉపాధుల్లోకి వెళ్లాలని అనుకునే వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. వెళ్లవచ్చు. అలాగే మతపరమైన జ్ఞానాన్ని అలాగే కాపాడుకుంటూ.. సాధారణ ఉద్యోగాల్లోకి ఇతరత్రా కాంపిటీటివ్ పరీక్షల వైపు వెళ్లాలనుకునే వారికి లాభం జరుగుతుంది.
నిజానికి మదర్సాల్లో నవీన విద్యను బోధించే పథకం గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసింది. ఇందుకోసం అప్పట్లోనే విద్యా వాలంటీర్లను నియమించారు. వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన వెంటనే.. చంద్రబాబు చేసిన ప్రతిపనినీ ధ్వంసం చేయడమే లక్ష్యంగా బతికిన జగన్మోహన్ రెడ్డి దీనిని కూడా రద్దు చేశారు.
తిరిగి మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మైనారిటీ సంఘాల నుంచి ఈ నవీన విద్యకోసం ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. మళ్లీ ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో రిజిస్టరు అయిన మదర్సాలు 174 ఉన్నాయి. వీటిలో మొత్తం 12,686 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికోసం ఒక్కో మదర్సాకు ముగ్గురేసి వాలంటీర్లను నియమిస్తారు. 12వేల రూపాయల వంతున వేతనాలు చెల్లిస్తారు. రాష్ట్రంలో మొత్తం 525 మంది వాలంటీర్లు అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారినే ఎంపిక చేయాలని అనుకుంటున్నారు.
మదర్సాలకు చంద్రబాబు సర్కారు ప్లాన్ చేస్తున్న మరో గొప్ప వరం ఏంటంటే.. ప్రతి మదర్సాలోనూ ఒక డిజిటల్ క్లాస్ రూపం ఏర్పాటు చేయబోతున్నారు. కంప్యూటర్లను కూడా ఏర్పాటుచేస్తారు. సైన్స్ గణితం కిట్స్,స్పోర్ట్స్ మెటీరియల్ కూడా అందించి.. నవీకరిస్తారు. గ్రంథాలయ నిర్వహణకు కూడా గ్రాంట్స్ ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే మదర్సాలు కేవలం మతాన్ని బోధించే పాఠశాలలుగా కాకుండా.. మతబోధలతో పాటు అన్ని రకాలుగానూ విద్యార్థులను తీర్చిదిద్దే విద్యాలయాలు అవుతాయి.
ముస్లిం మదర్సాల కోసం భేషైన ఆలోచన!
Friday, December 5, 2025
