స్టిల్ కౌంటింగ్ : చీరాల కూడా పాయె!

Friday, December 5, 2025

రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, నగర కార్పొరేషన్లను ఎన్నెన్ని వక్రమార్గాలను అనుసరించడం ద్వారా వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నదో లెక్కేలేదు. అప్పటి వారి అక్రమాలకు తగినట్టుగానే.. ఇప్పుడు అవన్నీ కూడా వారి చేజారుతున్నాయి. ఎంపీపీ స్థానాలు తమ చేతిలోనే ఉన్నాయని జగన్ మురిసిపోతున్నారుగానీ.. ఆయన మీద నమ్మకం సడలి మునిసిపాలిటీలన్నీ కూటమి పార్టీల పంచన చేరుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చీరాల మునిసిపాలిటీ కూడా కూటమి వశమైంది. ఇక్కడ అవిశ్వాసం లాంటి వాటి అవసరం కూడా రాలేదు. మునిసిపల్ ఛైర్మన్ పదవిలో ఉన్న జంజనం శ్రీనివాసరావు వైసీపీ కి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరిపోయారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. తెలుగుదేశంలో చేరడం వల్ల.. సొంతింటికి వచ్చినట్టుగా ఉన్నదని జంజనం శ్రీనివాసరావు పేర్కొనడం విశేషం.

జగన్ పార్టీని నడుపుతున్న తీరుతో.. అంతో ఇంతో రాజకీయ భవిష్యత్తు కోరుకుంటున్న వారందరికీ ఆ పార్టీలో వణుకు పుడుతున్నదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అధికార పార్టీలోకి నాయకులు ఫిరాయించడానికి, విపక్ష నాయకులు ఎన్ని కారాణాలైనా ఆపాదించవచ్చు గానీ.. అన్నింటినీ మించి జగన్ మీద వారిలో ఉన్న అపనమ్మకం, భయమే పెద్ద కారణం అని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
విశాఖపట్నం నగర కార్పొరేషన్ తమ పట్టులో ఉంచుకోవడం కోసం జగన్ ఎంత తాపత్రయ పడ్డారో అందరికీ తెలుసు. ఏకంగా ముగ్గురు మాజీ మంత్రులను రంగంలోకి దించారు. అనేక విధాలుగా పావులు కదిపారు. క్యాంపు రాజకీయాలు నిర్వహించారు. తెలుగుదేశంలో, జనసేనలో చేరిన వారికి మళ్లీ ప్రలోభాల ఎర వేశారు. వారిని నిర్బంధించడానికి కూడా ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఫలం దక్కలేదు. ఒకసారి జగన్ ను వద్దనుకున్న తర్వాత.. ఇక ఆ పార్టీ మొహం కూడా చూడకూడదనుకున్నట్టుగా కార్పొరేటర్లు వ్యవహరించడంతో మేయర్ పీఠం చేజారింది.

అదే క్రమంలో అనేక మునిసిపాలిటీలు కూడా కూటమి పరం అవుతున్నాయి. గుంటూరు మేయర్, కుప్పం ఛైర్మన్ పీఠాలు అదే రోజున కూటమికి దక్కాయి. ఆ వరుసలో ఇవాళ చీరాల మునిసిపల్ ఛైర్మనే రాజీనామా చేసి కూటమి జట్టులో చేరారు.

జగన్ తన వైఫల్యానికి అధికార పార్టీని నిందించడం మానుకోవాలని ఆ పార్టీనేతలే హితవు చెబుతున్నారు. ప్రతిదానికీ చంద్రబాబును నిందించడం మానేసి.. తన మీద తన పార్టీ నాయకుల్లో నమ్మకం కలిగేలా ఆయన పార్టీ ఎడ్మినిస్ట్రేషన్ చేయగలిగిన రోజున.. ఇంతమంది పార్టీని వీడిపోయే ప్రమాదం ఉండదని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. ఈ ఫిరాయంపుల వెనుక అసలు రహస్యం తన వైఫల్యమే అనే వాస్తవాన్ని జగన్ ఎప్పటికి గుర్తిస్తారో మరి!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles