ఆయన లోక్ సభ సభ్యుడు. ప్రస్తుతం అరెస్టు భయంతో వణికిపోతున్నాడు. ఇప్పటికే కొన్ని వరుస అరెస్టులు చోటుచేసుకోవడం.. విచారణలో నిందితులు తన పాత్రను కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉండడం కలిసి ఆయనను విపరీతమైన భయానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు మీడియా వారు కనిపిస్తే.. కూటమి ప్రభుత్వం తమ కుటుంబాన్ని రాజకీయ దురుద్దేశాలతో వేధిస్తున్నదని మేకపోతు గాంభీర్యపు పలుకులు పలుకుతున్నారే గానీ.. ఆచరణలో మాత్రం.. అరెస్టు భయంతో కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారు. ఏపీలో గత ప్రభుత్వకాలంలో కొత్త లిక్కర్ పాలసీ ముసుగులో 3200 కోట్ల రూపాయలకు పైగా సొమ్ములు కాజేసిన కుంభకోణంలో ప్రధాన పాత్రధారుల్లో ఒకరుగా, నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పుడు సుప్రీం కోర్టులో ముందస్తు బెయిలు ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇదే కేసులో మిథున్ రెడ్డి.. గతంలోనే హైకోర్టును ముందస్తు బెయిలు కోసం ఆశ్రయించారు. అప్పటికి ఆయన పేరు నిందితుల జాబితాలో కూడా లేదు. ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత.. మిథున్ రెడ్డి పేరు నిందితుల జాబితాలోకి వచ్చింది. ఆయన ప్రస్తుతం తనకు ముందస్తు బెయిలు కావాలంటూ ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ కు సంబంధించి వాదప్రతివాదాలు జరిగాయి. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ లు అవాక్కవడం జరిగింది.
ఎందుకంటే..
ఇది ఒక కుంభకోణానికి సంబంధించి ముందస్తు బెయిలు కేసు! కానీ.. అటు పిటిషనర్ తరఫు నుంచి గానీ, కౌంటర్ గా ప్రభుత్వం తరఫు నుంచి గానీ.. కొమ్ములు తిరిగిన న్యాయవాదులు హాజరయ్యారు. అటు ఇద్దరు ఇటు ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు వాదనలు వినిపించడానికి వచ్చేసరికి న్యాయమూర్తులకే ఆశ్చర్యం అనిపించింది. ‘‘చూడబోతే ఈ బెయిలు వ్యవహారంలో ఉన్నంత ఉద్రిక్తత.. ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో కూడా లేదేమో’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం గమనార్హం.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. పాకిస్తాన్ భారత్ మధ్య సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. యుద్ధవాతావరణమే అక్కడ ఉంది. కవ్వింపు కాల్పులు, దీటైన జవాబులు చోటు చేసుకుంటున్నాయి. మిథున్ రెడ్డి అరెస్టు భయంతో దాఖలు చేసిన పిటిషన్ వారికి అంత ఉద్రిక్తతలతో కూడుకున్నదిగా కనిపించిందన్నమాట.
మిథున్ రెడ్డి తరఫున కాంగ్రెస్ పార్టీ దిగ్గజం, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, మరో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రా హాజరయ్యారు. ఇంతటి పెద్ద న్యాయవాదులు వస్తే.. ఒక చిన్న ముందస్తు బెయిలు కేసుకు ఇరువైపులా నలుగురు సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారా అంటూ సుప్రీం న్యాయమూర్తులు అవాక్కవడంలో విశేషం ఏముంది? అని ప్రజలు అనుకుంటున్నారు.
మిథున్ రెడ్డి భయం : సుప్రీం జడ్జీలు అవాక్కయినవేళ!
Friday, December 5, 2025
