భారతీయ జనతా పార్టీ అంటే.. కొన్ని విలువలకు, సిద్ధాంతాలకు కట్టుబడిన, పాటించే పార్టీగా ఇప్పటికీ వారి శత్రువులు కూడా పరిగణిస్తూ ఉంటారు. అడపాదడపా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారు కూడా పార్టీ కట్టుబాట్లను, విలువలనుంచి పక్కకు మరలడం జరుగుతూ ఉంటుందిగానీ.. స్థూలంగా గమనించినప్పుడు.. ఆ పార్టీలో కొంత సిద్ధాంతపరమైన బలం, నియమబద్ధ ఎడ్మినిస్ట్రేషన్ ఉంటుందని నమ్మాలి. ఇటీవలి కాలంలో.. అనూహ్యమైన రీతిలో ఆ పార్టీ వారు కూడా కట్టుతప్పి.. విలువల బాటను వీడి ప్రవర్తించడం జరుగుతూ వస్తోంది. అయితే అలాంటప్పుడు ఆ పార్టీ పరువు కొంత మంటగలిసిపోతూ ఉంటుంది. అలా పోయే పరువును మరి కొన్ని నిర్ణయాల ద్వారా తిరిగి ఆర్జించుకునే ప్రయత్నం కూడా చేస్తుంటుంది బిజెపి నాయకత్వం. అలా పోయిన పరువును తిరిగి దక్కించుకునే ప్రయత్నంలాగానే.. ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపీ అభ్యర్థిగా భీమవరానికి చెందిన పాక వెంకట సత్యనారాయణను ఎంపికచ ేయడం జరిగిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఏపీలో రాజ్యసభకు ఎన్నికలు జరగడం ఇది రెండోసారి. వైసీపీకి చెందిన ఎంపీలు రాజీనామా చేయడం వలన.. గతంలో మూడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్య అప్పట్లో రాజీనామాలు చేశారు. మోపిదేవి ముందే తెలుగుదేశంలో చేరిపోయారు.. ఆయననే పార్టీ తిరిగి రాజ్యసభకు ప ంపింది. కానీ.. ఆర్.కృష్ణయ్య వైఎష్సార్ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తర్వాత కూడా చాలా ఊగిసలాట ధోరణిని ప్రదర్శించారు. ఏ పార్టీలో చేరాలో ఇదమిత్థంగా ఆయన నిర్ణయించుకోలేదు. ఎవరు తనకు పదవి కట్టబెడితే వారి వెంట నడవాలని అనుకున్నారు. ఆ గ్యాప్ లో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరుతారని కూడా కొన్ని పుకార్లు వినిపించాయి. తీరా.. రాజ్యసభ ఎంపీ ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి చివరిరోజున ఆర్.కృష్ణయ్య భారతీయ జనతా పార్టీలో చేరడం.. కాషాయ కండువా కప్పించుకోవడం, ఆ వెంటనే ఎంపీ టికెట్ కూడా దక్కించుకోవడం చాలా వేగంగా జరిగిపోయాయి.
అయితే ఆర్.కృష్ణయ్యకు అడ్డదారిలో అలా పదవిని కట్టబెట్టడం.. పా్రటీని నమ్ముకుని.. దశాబ్దాలుగా సేవలందిస్తున్న వారికి కడుపుమంట పెట్టింది. వారు తమ అసంతృప్తిని దాచుకోకుండా పార్టీ పెద్దలకు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్.కృష్ణయ్యను ఎంపీ పదవికి ఎంపికచేయడం అనే నిర్ణయం ద్వారా దక్కిన అపకీర్రతిని ఇప్పుడు పూర్తిగా తుడిచేసుకోవడానికి బిజెపి ప్రయత్నించింది. ఇప్పుడే పార్టీలో చేరి ఆ వెంటనే ఎంపీ పదవిని దక్కించుకోవాలని, ఆర్ కృష్ణయ్య బాటలోనే రాజ్యసభకు వెళ్లాలని కలలుగన్న, కిషన్ రెడ్డి ద్వారా తన ప్రయత్నాలు కూడా చేసుకున్న మందక్రిష్ణ మాదిగకు అవకాశం ఇవ్వలేదు. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు.. భీమవరానికి చెందిన వ్యక్తి, పార్టీ క్రమశిక్షణ సంఘానికి ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న పాక వెంకట సత్యనారాయణను ఎంపిక చేశారు. ఈ నిర్ణయం పట్ల పార్టీ కార్యకర్తల్లో అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.
అప్పుడొచ్చిన అపకీర్తిని తుడిపేసుకున్న కమలదళం!
Friday, December 5, 2025
