ఏపీలో కొలువుతీరిన కూటమి ప్రభుత్వం.. ఏడాదిరోజులు కూడా గడవక ముందే.. ఒక శాఖలో తాము ఇచ్చిన హామీలను వందశాతం పూర్తిగా అమల్లోకి తెచ్చేసింది. ఆ శాఖకు సంబంధించినంతవరకు కొత్తగా ఏ పనిచేసినా సరే.. కూటమ సర్కారు బోనస్ గా సంక్షేమం అమలు చేస్తున్నట్టే. రాష్ట్రంలోని వివిధ ఆలయాలలో తలనీలాలు తీసే పనిలో ఉన్న నాయీబ్రాహ్మణులకు నెలసరి వేతనం కనీసం 25 వేలు ఉండేలా చంద్రబాబునాయుడు సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఈ వర్గానికి ఇది ఎన్నికల నాడు ఆయన ప్రకటించిన హామీ. తాజాగా దీనికి సంబంధించి ఉత్తర్వులు వచ్చాయి.
ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలో 6ఏ కేటగిరీ కింద దాదాపు 175 ఆలయాలు ఉన్నాయి. ఇందులో 44 ఆలయాల్లో మాత్రం నిత్యం భక్తులు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. వీరికి గత ప్రభుత్వ కాలంలో రూ.20వేతనం అందేది. దానిని 25వేలకు పెంచుతాం అని ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఇటీవల దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించినప్పుడు.. ఆ హామీ అమలుచేయాలని ఆదేశించారు. ఆమేరకు ఇప్పుడు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ 44 ఆలయాల్లో ఏడాదికి కనీసం వంద పనిరోజులు ఉండే నాయీబ్రాహ్మణులకు నెలకు రూ.25వేల వంతున వేతనం అందుతుంది.
దేవాదాయశాఖకు సంబంధించి కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారం సమయంలో ఇంకా చాలా హామీలనే ప్రకటించాయి. మారుమూల పల్లెల్లో ఉండే చిన్న చిన్న ఆలయాల్లో పనిచేసే పురోహితులకు కూడా వేతనాలు పెంచుతాం అని చంద్రబాబునాయుడు అప్పట్లో ప్రకటించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది నవంబరులోనే ఆ హామీని కూడా అమలు చేశారు. చిన్న ఆలయాల్లో అర్చకులకు నెలకు కనీస వేతనం 15వేలకు పెంచుతూ అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల.. ప్రభుత్వం మీద ఏటా పదికోట్లరూపాయల భారం పడేలా 3203 మంది అర్చకులకు లబ్ధి చేకూరింది. ఇప్పుడు నాయీబ్రాహ్మణులకు ఇచ్చిన హామీ కూడా అమల్లోకి రావడంతో అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్ సర్కారు ఏడాదికోసారి డబ్బు మీకు ఖాతాల్లోకి ఇస్తున్నాం అనే పడికట్టు మాటలతో ఓటు బ్యాంకు నిర్మాణం మీదనే దృష్టి పెట్టేది తప్ప.. వారి జీవితాలకు స్థిరమైన ఆదాయం పెరిగే మార్గాలగురించి ప్రయత్నించేది కాదు.. పట్టించుకునేది కాదు. చంద్రబాబు సర్కారు ఏర్పడిన తర్వాత.. వేతనాలు పెంచడం అనేది మంచి పరిణామం అని నాయీబ్రాహ్మణులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
వారికి పండగే.. ఆ శాఖలో వరాలు వందశాతంపూర్తి!
Friday, December 5, 2025
