ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడువేల కోట్ల రూపాయలకు మించిన అవినీతి జరిగినటువంటి మద్యం కుంభకోణం విషయంలో వసూళ్ల సొమ్మును అంతిమంగా అందుకున్నటువంటి లబ్ధిదారు ఎవరు అనే సందేహాలు ప్రజలలో ఎన్నాళ్లుగానో సాగుతున్నాయి. అనుమానాలు బోలెడు ఉన్నప్పటికీ పేర్లు బహిరంగంగా ప్రస్తావించకుండా.. బిగ్ బాస్, కింగ్ పిన్ వంటి మాటలతో వ్యవహరిస్తూ వచ్చారు. కానీ మద్యం కుంభకోణానికి కర్త కర్మ క్రియగా పేరు తెచ్చుకున్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పోలీసులకు పట్టుబడిన తర్వాత ఆ చిక్కుముడి విప్పారు. బిగ్ బాస్ ఎవరో విస్పష్టంగా తేల్చి చెప్పారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే కొత్త మద్యం పాలసీ తయారైందని వెల్లడించారు. పార్టీ ఫండ్ భారీగా సమకూర్చవలసిన అవసరం ఉన్నది కనుక దానికి అనుగుణంగా భారీ స్థాయిలో ముడుపులు అందేలా జగన్ సూచన మేరకే ఈ పాలసీ రూపకల్పన జరిగిందని చెప్పారు. జగన్ పేషీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కింద సేవలందించిన కృష్ణమోహన్ రెడ్డి చేతికి ప్రతినెలా 50 నుంచి 60 కోట్ల రూపాయలు అందజేసినట్లుగా రాజ్ కసిరెడ్డి వెల్లడించారని సిట్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ లాంటి పదాలను అడ్డుపెట్టుకుని ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు స్పష్టంగా బయటికి వచ్చింది. ఈ దశలో కేవలం రాజకీయ ఆసక్తి ఉన్న నాయకులు కు మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో మెదలుతున్న ప్రశ్న ఒక్కటే.. జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఎప్పుడు?
తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో క్విడ్ ప్రోకో రూపంలో అనేక కంపెనీలకు అనుచిత మార్గాలలో లాభాలు చేకూర్చి అడ్డగోలుగా వేలకువేల కోట్ల రూపాయలు దండుకున్న కేసులు జగన్ మీద ఉన్నాయి. సుమారు 12 ఏళ్లుగా ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఆ కేసులు అతీగతీ లేకుండా నత్త నడకన సాగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు సుమారు నాలుగేళ్ల వ్యవధిలో 3200 కోట్ల రూపాయలు కాజేస్తూ జరిగిన లిక్కర్ కుంభకోణంలో అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని బయటకు వచ్చింది. వైయస్ జగన్ పురమాయింపు మేరకే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి తదితరులు అందరితోనూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విడతలు విడతలుగా సమావేశాలు నిర్వహించి మద్యం పాలసీకి రూపకల్పన చేశారు. ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు. అందరూ కలిసి మద్యం విక్రయాల సొమ్మును ఎలా దండుకోవాలో ఒక పక్కా ప్రణాళిక రూపొందించారు. ‘పార్టీ ఫండ్ కోసం’ అనే ముసుగులో ప్రధాన షేర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి కి అందింది. ఈ కుంభకోణంలో పాత్రధారులైన మిగిలిన వారందరూ కూడా చిల్లర డబ్బులు పంచుకున్నారు. వారి పేర్లన్నీ ఇప్పటికే లిక్కర్ స్కాం కేసు రికార్డుల్లో ఉన్నాయి. అసలు బిగ్ బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు మొట్టమొదటిసారిగా రిమాండ్ రిపోర్టు లోకి వచ్చింది. మరి ఆయనను ఎప్పుడూ అరెస్టు చేస్తారు? అనే సందేహం ప్రజలకు కలగడం సహజం!!
సిబిఐ, ఈ కేసులలో బెయిలు తీసుకుని యథేచ్చగా బాహ్య ప్రపంచంలో తిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి. ఈ లిక్కర్ స్కాం కేసులో ఆయన అరెస్టు అయితే గనుక అంత సులువుగా బయటకు రావడం జరగదని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అన్నట్లుగా తప్పించుకునే దారి లేదని అర్థమయ్యేంతవరకు జగన్ పేరు బయటకు రానివ్వకుండా పక్కా సాక్షాధారాలు సేకరించడంలోనే ప్రభుత్వ పోలీసు వర్గా లు ఇన్నాళ్లు గడిపాయి. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి అరెస్టు తరువాత, పక్కా ఆధారాలు కూడా చిక్కడంతో జగన్ పేరును కూడా రిమాండ్ రిపోర్టులోకి తీసుకువచ్చారు. ఆయన మరోసారి కటకటాల వెనక్కి వెళ్ళడం అనివార్యం అని ఈ పరిస్థితులు చాటి చెబుతున్నాయి.
అందరి సందేహం ఒక్కటే: జగన్ అరెస్టు ఎప్పుడు?
Monday, December 15, 2025
