వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రమోషన్ లభించింది. అదేమిటి చెప్మా! ఆయనకు ప్రస్తుతం పదవే లేదు కదా.. ప్రమోషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ప్రమోషన్ ఘనంగా చెప్పుకోగలిగేది.. పార్టీ చేసుకునేది కాదు. ఆందోళనకు గురి చేసేది! మద్యం కుంభకోణంలో నిన్నటిదాకా సాక్షి అనే హోదాలో విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు నిందితులలో ఒకరుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ మొత్తం కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించిన వాస్తవాలు, కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న వివరాలను బట్టి విజయసాయిరెడ్డి కూడా మద్యం కుంభకోణం ముడుపులు పుచ్చుకున్న వారిలో ఒకరు అని తెలుస్తోంది.
సోమవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు ఆ రాత్రికే విజయవాడకు తరలించారు. విజయవాడ సిట్ కార్యాలయంలో తెల్లవారుజామున 4 గంటల వరకు ఆయనను విచారించారు. అప్పుడు కొంత విరామం ఇచ్చి మళ్లీ మంగళవారం సాయంత్రం వరకు కూడా విచారించారు. కోర్టుకు ప్రవేశ పెట్టవలసిన గడువు మించిపోతుంది కనుక ఆయనకు వైద్య పరీక్షలు చేయించి కోర్టుకు తీసుకువెళ్లారు. అయితే సుదీర్ఘంగా చేసిన విచారణలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా అనేక విస్మయపరిచే వాస్తవాలు సేకరించినట్లుగా తెలుస్తోంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే అన్నీ చేసినట్లుగా రాజ్ కసిరెడ్డి వెల్లడించారు. ఈ కుంభకోణం నడిపించడంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ కు కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా ఇస్తామని ఆశ పెట్టారన్నారు. జగన్ పురమాయింపు మేరకే విజయ సాయి రెడ్డి నివాసాలలో వాసుదేవ రెడ్డి, సత్యప్రసాద్, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి తదితరులతో కలిసి పాలసీ రూపకల్పనకు సమావేశాలు నిర్వహించినట్లుగా రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి కూడా ఈ భేటీలలో పాల్గొన్నట్లు చెప్పారు. వసూళ్లు చేసిన సొమ్ములన్నీ ఫైనల్ గా మిథున్ రెడ్డి ద్వారా ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి చేతికి నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు వెళ్లేవని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే మిథున్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి, బాలాజీ అనే మరో వ్యక్తికి కూడా నెలవారీ చెల్లింపులు జరిగేవని చెప్పినట్లుగా తెలుస్తోంది.
రాజ్ కసిరెడ్డి పోలీసులకు దొరికిన వెంటనే విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో తాను ఒక రూపాయి కూడా ముట్టలేదని తనను తాను సర్టిఫై చేసుకుంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవాలను కసిరెడ్డి వెల్లడిస్తారనే భయంతోనే విజయ సాయి ఇలా చేసినట్లుగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అందరి బట్టలు విప్పదీస్తానని విజయసాయి ప్రకటించడం వెనుక ఆంతర్యం ఇదేనని అంటున్నారు. అయితే కసిరెడ్డి బయట పెట్టిన వివరాల్లో ముడుపులు పుచ్చుకున్న వారిలో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉంది. కసిరెడ్డి చెప్పిన ఇతర వివరాలను పరిగణనలోకి తీసుకుని వారందరినీ నిందితుల జాబితాలో చేర్చి విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం పూనుకునేట్లయితే.. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి పేరు కూడా నిందితుల జాబితాలోకి చేరుతుంది. నిన్నటిదాకా సాక్షి అనే హోదాలో అందరి బాగోతాలు బయట పెడతానని డాంబికంగా ప్రకటిస్తూ వచ్చిన విజయసాయిరెడ్డి ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ నిందితుడిగా వచ్చి అసలు సంగతులు వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
వారెవ్వా.. సాక్షి నుంచి నిందితుడిగా ప్రమోషన్!
Friday, December 5, 2025
