పునర్విచారణలో తేలనున్న ‘అనంత’ పాపాలు!

Friday, December 5, 2025

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అరాచకం మళ్లీ తెరమీదకు వస్తున్నది. ఈ దురాగతానికి పాల్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు చిక్కుల్లో పడే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఈ కేసు విచారణ సవ్యంగా సాగలేదనే ఆరోపణలు రావడంతో పునర్విచారణకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. విచారణ అధికారిగా ఐపీఎస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ ను  నియమించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న అనంతబాబు గతంలో తన డ్రైవర్ దళిత యువకుడు సుబ్రహ్మణ్యం ను హత్య చేసి అతని ఇంటికే డోర్ డెలివరీ చేశారు. ఈ హత్య అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. కేసు నమోదు అయింది. సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్లుగా అనంతబాబు ఒప్పుకున్నారని కూడా ఒక దశలో పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత అనంతబాబుకు బెయిలు లభించింది. ఆయన ఒలింపిక్ స్వర్ణపతకం సాధించిన విజేత స్థాయిలో భారీ ఊరేగింపుతో గజమాలలతో జైలునుంచి బయటకు వచ్చారు. తర్వాత కేసు నెమ్మదిగా నీరుగారిపోయింది.

అప్పట్లో కేసు విచారణ పూర్తి లోపభూయిష్టంగా సాగిందని, చార్జిషీట్ దాఖలు చేయడంలో కూడా అనేక లోపాలు ఉన్నాయని కేసులో అసలు పురోగతి కనిపించకుండా పోయిందని హతుడి కుటుంబ సభ్యులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు, లోకేష్ లకు విన్నవించుకున్నారు. న్యాయం చేస్తాం అని వారు అప్పట్లో హామీ ఇచ్చారు కూడా!

ఇదిలా ఉండగా జగన్ బాధిత కుటుంబాలను ఆదుకోవడం, వారి తరఫున పోరాడడం మాత్రమే తన ఎజెండా అని ప్రకటించుకుంటూ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏ బి వెంకటేశ్వరరావు కూడా సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను కలిసి వారికి తన మద్దతు తెలియజేశారు. ఈ కేసు పునర్విచారణ అవసరం ఉన్నదని ఆయన జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం కూడా ఇచ్చారు. ఎట్టకేలకు జిల్లా ఎస్పీ తాజాగా పునర్విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి కోర్టు పరంగా కూడా ఆదేశాలు తీసుకోనున్నారు. సాంకేతిక ఆధారాలతో కేసును మరింత లోతుగా విచారించాలని కోర్టును కోరనున్నారు. చేసిన నేరం నుంచి అనంతబాబు తప్పించుకునే అవకాశం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా హత్య చేసి కూడా బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా తిరగ గలిగారని ఇప్పుడు అలా జరగదని అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles