మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి అరెస్టు అయ్యారు. సిట్ పోలీసులకు చిక్కిన తర్వాత కూడా బుకాయించి తప్పించుకోవడానికి ప్రయత్నించిన రాజ్ కసిరెడ్డి పాచికలు పారలేదు. మంగళవారం ఖచ్చితంగా విచారణకు వస్తానని, నమ్మించాలనుకున్నా.. పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. అసలు మంగళవారం విచారణకు హాజరయ్యే ఉద్దేశమే రాజ్ కసిరెడ్డికి లేదని, గోవాలో ఉంటే తనను అరెస్టు చేసే అవకాశం ఉన్నది గనుక.. అక్కడినుంచి హైదరాబాదు వచ్చి, గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు పారిపోవాలని అనుకున్నట్టుగా తెలుస్తోంది. సోమవారం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమం గమనిస్తే ఈ పుకార్లు నిజమే అనిపిస్తుందికూడా!
కొన్ని వారాలుగా రాజ్ కసిరెడ్డి పరారీలోనే ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా ఏడిపిస్తున్నారు. ఆయనకోసం సిట్ పోలీసులు ప్రత్యేకబృందాలుగా ఏర్పడి వేర్వేరు రాష్ట్రాల్లో గాలించినా కూడా ప్రయోజనం దక్కలేదు. ముందుగానే లుకౌట్ నోటీసులు ఇచ్చి ఉన్నందున దేశం దాటే అవకాశం లేదని మాత్రం పోలీసులు భావించారు. కాగా, ఇన్నాళ్లూ గోవాలో దాక్కుని ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అక్కడ కూడా ఎక్కువ కాలం సురక్షితంగా ఉండలేనని గ్రహించాడు. దీంతో నకిలీ పత్రాలు హైదరాబాదులో తయారు చేయించారు.
గోవాలో ఉన్నా అరెస్టు తప్పదు. హైదరాబాదు వచ్చినా అరెస్టు తప్పదు అనే భయం రాజ్ కసిరెడ్డిలోను, ఆయనకు సహకరిస్తున్న తెరవెనుక వ్యక్తుల్లోనూ ఉంది. ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో వేసిన పిటిషన్ సోమవారం తిరస్కరణకు గురైంది. దాంతో ఇక గత్యంతరం లేదని, దేశం దాటి వెళ్లిపోవాలని రాజ్ కసిరెడ్డి డిసైడ్ అయ్యారు. పోలీసులు తనను టార్గెట్ చేయకుండా కాస్త రిలాక్స్ అయ్యేలా చేసి దేశం విడిచి పారిపోవాలని అనుకున్నారు. అందుకే సోమవారం బెయిల్ పిటిషన్ తిరస్కరణ జరిగాక, మంగళవారం తాను విచారణకు రాబోతున్నట్టుగా ఆడియో విడుదల చేశారు. ఈ మేరకు సిట్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. తాను హాజరవుతానని అనడం వల్ల.. వాళ్లు రిలాక్స్ అయి మంగళవారం కోసం వెయిట్ చేస్తుంటారనేది ఆయన వ్యూహం.
అందుకే సోమవారం గోవానుంచి ఇండిగో విమానంలో రాజేశ్ రెడ్డి అనే దొంగపేరుతో ప్రయాణించి వచ్చారు. పోలీసులు రిలాక్స్ మూడ్ లో ఉన్నప్పుడు సోమవారమే నకిలీ పత్రాల సాయంతో దుబాయి పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ పోలీసులు కూడా ఆయనకంటె కాస్త ముందుకు వెళ్లి ఆలోచించినందువల్ల, మరియు, కొంత సమాచారం తమ వేగుల ద్వారా సేకరించడం వల్ల.. గోవానుంచి వస్తున్న సంగతి తెలుసుకుని ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేశారు. మిస్ లీడింగ్ లీకులతో కళ్లుగప్పి పారిపోవాలనుకున్న స్కెచ్ ఫలించలేదని తెలుస్తోంది.
మిస్ లీడింగ్ లీకులిచ్చి. దేశం దాటాలనుకున్న కసిరెడ్డి!
Friday, December 5, 2025
