ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అవతరించి బోతున్న అమరావతిప్రాంతంలో ఎటు చూసినా కొత్త నిర్మాణాల హడావుడి కనిపిస్తోంది. ఆధునిక పద్ధతుల్లో త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేయడానికి అవసరమయ్యే యంత్రాలు, మెషినరీ వందల సంఖ్యలో అమరావతి ప్రాంతానికి చేరుకుంటున్నాయి. అలాగే ఇరవై వేలమందికి పైగా భనవ నిర్మాణ కార్మికులు కూడా ఈ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంమొత్తం ఎంతో సందడిగా ఉంది. మహా అయితే ఇంకో పదిరోజులు! మే2వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా.. రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగిన తర్వాత.. మూడో తేదీనుంచి.. నిర్మాణ పనులన్నీ ఒక్కసారిగా జోరందుకోబోతున్నాయి. అమరావతి అనే స్ఫూర్తిని, రాష్ట్రప్రజల స్వప్నాన్ని మరుభూమిగా మార్చేయాలనే దురాలోచనతో అయిదు సంవత్సరాల తన పాలన కాలంలో ఇక్కడ ఒక్క ఇటుక అయినా పేర్చిన పనిచేయకుండా.. నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గానికి విరుగుడుగా పనులు జరగబోతున్నాయి. అయిదేళ్ల పాటు న్యూట్రల్ గేర్ లో ఉండిపోయిన అమరావతి పనులు ఒక్కసారిగా టాప్ గేర్ లోకి వెళ్లబోతున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధాని చేతుల మీదరు పున్నర్నిర్మాణాల ప్రారంభం కార్యక్రమం మే 2వ తేదీన జరగనుంది. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆ కార్యక్రమాన్ని భారీ బహిరంగ సభను సఫలం చేయడం మీదనే దృష్టి కేంద్రీకరిస్తోంది. చంద్రబాబునాయుడు చాన్నాళ్ల కిందటే ఈ కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి మంత్రుల కమిటీని వేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, నారాయణ కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాని చేతుల మీదుగా లక్ష కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగబోతున్నట్గుగా కేశవ్ చెబుతున్నారు. కార్యక్రమం జరిగిన మరుసటి రోజునుంచే పనులు వేంగా జరుగతాయంటున్నారు.
ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి అయిదు లక్షల మంది ప్రజలను సమీకరించాలని ప్రభుత్వం టార్గెట్లు పెట్టుకుంది. ఈ మేరకు ఇప్పటికే అమరావతి పరిసర జిల్లాల్లోని అధికారులకు, పార్టీ నాయకులకు కూడా సమాచారం పంపారు. చంద్రబాబునాయుడు కూడా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున కొత్త విజ్ఞప్తులతో పాటు ఈ కార్యక్రమం గురించిన చర్చ కూడా మోడీతో జరిగే అవకాశం ఉంటుంది. అలాగే గతంలో ప్రారంభించిన సమయంలో చేసినట్టు కాకుండా.. ప్రధాని ఈ సభలో ఖచ్చితంగా అమరావతికి కొత్త వరాలు ఏదో ఒకటి ప్రకటిస్తారనే ఆశ రాష్ట్ర ప్రజల్లో ఉంది. నిర్మాణాలకు అవసరమైన అన్ని నిధులకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొన్ని పనులకు తొలివిడత సొమ్ము విడుదల కావడం కూడా జరిగింది. ప్రధాని రావడమే తరువాయి.. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ తర్వాత పనులు సాగిపోతాయని అంతా అనుకుంటున్నారు.
న్యూట్రల్ టూ టాప్ గేర్ : జోరందుకుంటున్న అమరావతి!
Friday, December 5, 2025
