కసిరెడ్డి అరెస్ట్ : ‘రేపు గ్యారంటీ వస్తా..’.. ‘ఇప్పుడే పద’!

Thursday, December 11, 2025

ఇన్నాళ్లూ పో లీసుల కళ్లుగిప్పి తిరుగుతున్నప్పుడు.. వారు తనకోసం అనేక బృందాలుగా ఏర్పడి.. వివిధ రాష్ట్రాల్లో గాలిస్తున్నట్టుగా వార్తలు చూస్తున్నప్పుడు.. తనను పట్టుకోలేక అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు. తన బంధువలందరికీ నోటీసులు ఇస్తున్నప్పుడు బహుశా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చాలా అహంకారంతో నవ్వుకుంటూ ఉండిఉంటారు. చివరికి పోలీసులు తన తండ్రిని విజయవాడకు పిలిచి రెండు రోజుల పాటు విచారించి పంపిన తర్వాత.. కాస్త మెత్తబడ్డారు. పోన్లే పాపం.. ఒకసారి విచారణకు హాజరై వద్దాం అని సిద్ధపడ్డారు. హైకోర్టు ముందస్తు బెయిలును తిరస్కరించిన తర్వాత..  మంగళవారం విచారణకు వస్తానని ముందే ఆడియో సందేశం పంపారు. మిథున్ రెడ్డి లాగా.. రాచఠీవితో వచ్చి వెళ్దాం అనుకున్నారు. కానీ.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగేసరికి సిట్ పోలీసులు రాజ్ కసిరెడ్డిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు.

ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్  వద్ద హైడ్రామా నడిచినట్టుగా తెలుస్తోంది. కసిరెడ్డి దుబాయి నుంచి వచ్చినట్టుగా తొలుత వినిపించింది. కానీ, ఆయన రాజేష్ రెడ్డి అనే మారు పేరుతో గోవా నుంచి ఇండిగో ఫ్లైట్ లో వచ్చినట్టుగా గుర్తించారు. సిట్ పోలీసులు తనను  పట్టుకున్న తరువాత.. ఇప్పటికి వదలిపెట్టాలని రాజ్ కసిరెడ్డి వారిని బతిమాలుకున్నట్టుగా సమాచారం. రేపు విచారణకు ఖచ్చితంగా వస్తానని ఆయన అడిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు ఏ మాత్రం రాజీపడకుండా.. ఆ  పప్పులేం కుదరవు అన్నట్టుగా.. ఇప్పటికిప్పుడు తమతో విజయవాడకు రావాల్సిందే అని వెంటబెట్టుకుని వెళ్లినట్టుగా తెలుస్తోంది.

మూడు వేల కోట్ల రూపాయలకు పైగా సొమ్ముల అవినీతి జరిగిన లిక్కర్ కుంభకోణంలో.. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని పోలీసులు గుర్తించారు. ఆయన ద్వారా.. అంతిమలబ్ధిదారులు, తెరవెనుక నుంచి నడిపించిన వ్యక్తులు, లాభపడిన అంతిమ లబ్దిదారులు, కింగ్ పిన్ లు, బిగ్ బాస్ లు ఎవరో తేలుతుందని అనుకుంటున్నారు. పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన విషయాలనే.. గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ రూపొందడంలో తొలిదశలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా.. కసిరెడ్డి పాత్రను నిర్ధరిస్తూ వాంగ్మూలం ఇచ్చారు.

రాజేష్ అనే మారుపేరుతో కసిరెడ్డి గోవానుంచి వచ్చారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత.. పోలీసులు ఎయిర్ పోర్టులో మాటు వేస్తారని ఆయన ఊహించలేదు. ఒక్కసారి చుట్టుముట్టగానే ఆయన నిర్ఘాంతపోయారని సమాచారం. ఆయన ప్లాన్ ప్రకారం.. హైదరాబాదు చేరిన తర్వాత.. ఈ స్కామ్ తో గట్టి సంబంధం ఉన్న కొందరు కీలక నాయకులు, తన కోసం పనిచేసే లాయర్లు, తనకు తొలినుంచి సలహాలిస్తూ నడిపిస్తున్న సస్పెన్షన్ లోని ఐపీఎస్ అధికారి తదితరులతో ఈ రాత్రంతా భేటీలు నిర్వహించి.. విచారణ ఎలా ఎదుర్కోవాలో ఒక బ్లూప్రింట్ తయారుచేసుకుని వెళ్లాలనుకున్నారు. కానీ.. ఆయన ఊహలకు భిన్నంగా ఎయిర్ పోర్టులోనే అరెస్టు అయిపోయారు. ఇక పోలీసుల విచారణలో ఎలాంటి సంచలనాత్మక విషయాలు బయటకు వస్తాయో వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles