భారతీయ జనతా పార్టీ తమది సిద్ధాంత బలం ఉన్న పార్టీ అని చెప్పుకుంటూ ఉంటుంది. అలాగే.. నిజాయితీకి మారుపేరు అని కూడా చెప్పుకుంటుంది. అవినీతి కార్యకలాపాలకు తమ పార్టీ దూరంగా ఉంటుందని కూడా చాటుకుంటుంది. కొందరు నాయకుల విషయంలో ఇదంతా నిజమే కావొచ్చేమో గానీ.. మారుతున్న పరిణామాల్లో ఇతర పార్టీల నుంచి వలసవస్తున్న నాయకులను అనుసరిస్తున్న ధోరణలు, సాగిస్తున్న దందాలు బిజెపి పరువు తీసేలా తయారవుతున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ప్రత్యేకించి.. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో.. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలను వీలైనంతగా కట్టుబాటులో ఉంచుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే.. బిజెపికి తమ పార్టీ ఎమ్మెల్యేల మీద నియంత్రణ లేదా? అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.
కడపజిల్లా జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహారళి చాలా రకాలుగా వివాదాస్పదంగా మారుతోంది. గతంలో ఆయన తాడిపత్రికి చెందిన తెలుగుదేశం నాయకుడు జెసి ప్రభాకరరెడ్డితో వైరం పెట్టుకున్నారు. మా జిల్లాలో వచ్చి మీరు కార్యకలాపాలు నిర్వహించడం ఏంటంటూ రచ్చ చేశారు. ఇప్పుడు తన నియోజకవర్గం పరిధిలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంటు కంపెనీ మీద ఒత్తిడులు పెంచుతూ.. తన మాట సాగాలని, ఫ్యాక్టరీ పరిధిలోని రవాణా కాంట్రాక్టులన్నీ తన అనుచరులకే ఇవ్వాలని వారి మీద కర్రపెత్తనం చేస్తున్నారు.
ఆయన అనుచరులకు కొన్ని కాంట్రాక్టులు ఇచ్చినప్పటికీ.. ఫ్యాక్టరీనుంచి రవాణా కాంట్రాక్టులు సమస్తం తమకే ఇవ్వాలంటూ ఆదినారాయణ రెడ్డి రచ్చ చేస్తుండడం మొత్తం కూటమి ప్రభుత్వం పరువు తీస్తోంది. ఆయన కేవలం డిమాండ్లతో ఆగడం లేదు. కంపెనీకి ముడిసరుకు రవాణా చేసే వాహనాలను అడ్డుకోవడంతో రెండు యూనిట్లలో ప్రొడక్షన్ ఆగిపోయింది. తన దాదాగిరీ రచ్చకెక్కేసరికి సిమెంటు ఫ్యాక్టరీ వాళ్లు వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారంటూ.. ఆదినారాయణ రెడ్డి విషయాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుండడం విశేషం.
రాష్ట్రంలో కూటమి పరిపాలన నడుస్తున్నది. దీంతో.. ఒక పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టకూడదు అనే ధర్మాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన నాయకులు పాటిస్తున్నారు. బిజెపి ఎమ్మెల్యే దందాల గురించి వారు బహిరంగంగా నోరు తెరవకపోయినప్పటికీ.. ఈ తీరు తమ ప్రభుత్వానికి మచ్చ తెస్తుందని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అయితే.. ఆదినారాయణ రెడ్డి దూకుడును, దాదాగిరీని, అరాచకాలను కంట్రోల్ చేసే శక్తులు కమలదళంలో లేవా? పార్టీ పరువు పోయినా పరవాలేదని వారు అనుకుంటున్నారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
ఆ అరాచక ఎమ్మెల్యేని అడిగే దిక్కే లేదా?
Friday, December 5, 2025
