భూమన పుణ్యం.. అన్ని పాపాలూ బయటికొస్తున్నాయ్!

Friday, December 5, 2025

టీటీడీ గోశాల విషయంలో భూమన కరుణాకరరెడ్డి అసంబద్ధమైన ఆరోపణలు చేయడం ద్వారా.. టీటీడీ సంస్థను భ్రష్టు పట్టించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. నాటకీయంగా డైలాగులు రువ్వడం, సవాళ్లు విసరడం, రోడ్ల మీద పడుకుని హైడ్రామా చేయడం  భూమన అలవాటుగా మార్చుకున్నారు.  మొత్తానికి భూమన పుణ్యమాని  టీటీడీ అధికారులు గోశాల వ్యవహారాల మీద గట్టిగానే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో గత అయిదేళ్లలో గోశాలలో ఎలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయో వెలుగుచూస్తుండడం విశేషం. మొన్నమొన్నటిదాకా టీటీడీ  గోశాల డైరక్టరుగా ఉన్న హరినాథరెడ్డి ఊహకు కూడా అందని అకృత్యాలకు ఏ రీతిగా పాల్పడుతూ వచ్చారో గుర్తించి నివ్వెరపోతున్నారు.

గోశాలను సందర్శించిన టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేకంగా గతంలో నిర్వహణ ఎలా సాగినదో తెలుసుకోవడానికి 2022-24 మధ్య కాలంలో రెండేళ్ల పాటు గోసంరక్షణ సభ్యుడిగా ఉన్న కోటి శ్రీధర్ ను కూడా సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఆయన చెబుతున్న వివరాలు విస్తుగొలిపేలా ఉన్నాయని అంటున్నారు. గతంలో గోశాలలోని ఆవులను తీసుకువెళ్లి ఒంగోలులో విక్రయించే వారని గుర్తించినట్టుగా చెబుతున్నారు. అలాగే గోవుల దాణాకు కేటాయించిన సొమ్ముతోనూ అనేక రకాలుగా అవినీతికి పాల్పడినట్టు వెల్లడిస్తున్నారు. హరినాథరెడ్డి గోశాల డైరక్టరుగా ఉండగా.. విపరీతమైన అక్రమాలు జరిగినట్టుగా ఇప్పుడు అధికారులు గుర్తిస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానాల వంటి మహా సంస్థలో కొత్తగా ఏర్పాటు అయ్యే పాలకమండలి ప్రతి విభాగంలోనూ కూలంకషంగా పరిశీలిస్తూ ఉండడం అనేది సాధారణంగా జరగదు. అదే మాదిరిగా.. బిఆర్ నాయుడు నేతృత్వంలోని పాలకమండలి కూడా.. గోశాలపై పెద్దగా దృష్టి సారించలేదు. ఇప్పుడు భూమన రాద్ధాంతం చేసేవరకు అక్కడి వ్యవహారాలను గమనించలేదు. తీరా ఇప్పుడు అక్కడ దృష్టి సారిస్తోంటే.. గత అయిదేళ్లుగా ఏమేం జరిగాయో తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.

వైకుంఠఏకాదశి సందర్భంగా తొక్కిసలాటకు బాధ్యుడిగా భావించి హరినాధరెడ్డిని ప్రస్తుతం సస్పెండ్ చేసి ఉన్నారు. ఆయన గోశాల గురించి తప్పుడు సమాచారం ఇస్తూ భూమనతో మాట్లాడిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. అయితే హరినాథరెడ్డి అరాచకాలు ఇంకా అనేకం ఉన్నాయని.. చివరికి ఆయన గోశాల రికార్డులను కూడా తన వెంట తీసుకువెళ్లారని.. ఈ అన్ని నేరాలపై ప్రభుత్వంతో చర్చించి.. ఆయన మీద ఏసీబీ కేసు నమోదు  చేయిస్తామని బిఆర్ నాయుడు అంటున్నారు. భూమన తప్పుడు ఫోటోలతో ఇప్పుడు చేస్తున్న రాద్ధాంతం ఎక్కడివరకు వెళుతుందో గానీ.. ఆయన రచ్చ పుణ్యమాని గత అయిదేళ్ల బాగోతాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles