‘మీరు అన్నీ ఊహించుకుంటున్నారు. మద్యంకుంభకోణం జరిగిందని.. ముడుపులు ముట్టాయని, ఆ ముడుపులకు మేం సారథ్యం వహించామని ఊహించుకుని.. వాటి ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు..’ అని అర్థం వచ్చేలాగా.. ఊహాజనిత ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వను అంటూ ఎంపీ మిథున్ రెడ్డి.. లిక్కర్ స్కామ్ విచారిస్తున్న సిట్ అధికారుల మీద ఎదురుదాడికి దిగారు. శనివారం సిట్ ఎదుట విచారణకు హాజరైన ఆయనను వంద ప్రశ్నలతో దాదాపు 7 గంటలకు పైగా విచారించినప్పటికీ.. అన్నింటికీ నాకు సంబంధం లేదు, తెలియదు, గుర్తులేదు, అసలు కుంభకోణమే జరగలేదు, మా రికార్డులు అన్నీ సక్రమమే అంటూ.. మడత పేచీ మాటలు మాటలు వల్లిస్తూ మిథున్ రెడ్డి అధికార్లను తికమక పెట్టేందుకు ప్రయత్నించారు. అధికారులు తాము అడుగుతున్న ప్రశ్నలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు చూపించినప్పటికీ కూడా.. ఆ ఆధారాలనుకూడా తప్పని అంటూ తొలుత బుకాయించే ప్రయత్నం చేస్తూనే.. మిథున్ రెడ్డి నీళ్లు నమలడం విశేషం.
ఆడాన్ డిస్టిలరీస్ ఏర్పాటులో మిథున్ రెడ్డి పాత్ర గురించి, అలాగే ఆ సంస్థకు మాత్రమే ఎక్కువ కొనుగోళ్లకు ఆర్డర్లు ఇవ్వడం గురించి, వాటాలు వసూళ్లు చేసే నెట్ వర్క్ తో సంబంధాల గురించి సిట్ ప్రశ్నిస్తే తనకు సంబంధం లేదనే మిథున్ రెడ్డి అన్నారు. విజయసాయి ఇంట్లో లిక్కర్ సమావేశాల గురించి.. తమ పార్టీ ఎంపీ గనుక.. వారి ఇంట్లో సమావేశాలకు వెళ్లాను గానీ.. అవి లిక్కర్ సమావేశాలే కాదంటూ దబాయించారు. అసలు స్కామే జరగలేదంటే.. అందులో వాటాలు గురించి మీరు అడగడంలో అర్థం లేదని మిథున్ రెడ్డి అధికార్లతో అనడం చిత్రం. పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ సంస్థ నుంచి భారీ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని బ్యాంకు స్టేట్మెంట్ల సహా ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినప్పుడు కూడా.. మిథున్ రెడ్డి అవన్నీ అబద్ధాలు అని కొట్టేయడం తమాషాగా ఉంది.
మొత్తానికి మిథున్ రెడ్డి పోలీసుల విచారణకు ఏమాత్రం సహకరించలేదని.. ఇంకా చెప్పాలంటే.. వారి మీద ఎదురుదాడికి దిగారని తెలుస్తోంది. పోలీసులు కూడా ఆయన చెప్పినదంతా నమోదు చేసి సంతకాలు తీసుకుని మళ్లీ రావాల్సి ఉంటుందని చెప్పి పంపారు. బయటకు వచ్చిన తర్వాత.. ప్రభుత్వం మీద విమర్శల దాడికి దిగారు మిథున్ రెడ్డి. తనమీద అన్నీ అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ఒక్క కేసు కూడా నిరూపించలేరని ధీమా వ్యక్తం చేశారు. విమెన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ కేసులు తప్ప తన మీద అన్ని కేసులూ పెట్టారంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేయడం గమనార్హం.
మీవన్నీ ఊహలు.. సిట్ పై మిథున్ రెడ్డి ఎదురుదాడి!
Friday, December 5, 2025
