వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు అక్కర్లేదు- అని వారు ఒకసారి ఫిక్సయ్యారు. ఆ పార్టీతో భవిష్యత్తు ఉండదు అని అనుకున్నారు. తమ రాజకీయ జీవితాలు పదిలంగా సాగాలనుకున్నా.. తమ విశాఖ నగరం పద్దతిగా అభివృద్ధి చెందాలన్నా తాము కూటమి పార్టీలతో ఉండడమే శ్రేయస్కరం అని వారు విశ్వసించారు. ఒకసారి వారి నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత.. వారిని కట్టడి చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, కుయుక్తులు పన్నినా ప్రయోజనం ఏముంటుంది? అందుకే.. విశాఖ నగర కార్పొరేషన్ మేయరు హరి వెంకటకుమారిపై కూటమి పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఏదో ఒక అద్భుతం జరిగి.. కోరం లేకుండాపోయి.. అసలు సమావేశమే రద్దవుతుందనే అత్యాశతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి గైర్హాజరైనా.. వారి ఆశ నెరవేరలేదు. జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి విశాఖ శోకమే దక్కింది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్ని అత్యంత అరాచకంగా నిర్వహించారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు అసలు నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిని కిడ్నాపులు చేశారు, కొట్టించారు, వారి నామినేషన్ పత్రాలు లాక్కుని చించేశారు.. నానా బీభత్సాలు చేశారు. మొత్తానికి అన్ని ఎన్నికల్లో తాము గెలిచాం అనిపించుకున్నారు.
ప్రత్యేకించి విశాఖపట్టణం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం సున్నా! 2019 ఎన్నికల్లో కూడా అది నిరూపణ అయింది. అయితే ఆ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన జగన్.. ఆ ప్రకటన తర్వాత జనం తనకు నీరాజనాలు పడతారని అనుకున్నారు. ఇలాంటి అడ్డదారుల్లో కార్పొరేషన్ దక్కించుకుని.. ప్రజలు నీరాజనాలు పడుతున్నట్టుగా భ్రమించారు. కానీ.. విశాఖను అలా రాజధానిగా ప్రకటించడం అనేది కేవలం రుషికొండకు గుండుకొట్టడానికి, విశాఖ వ్యాప్తంగా తన మనుషులతో భూకబ్జాలు సాగించడానికే తప్ప.. నిర్దిష్టంగా విశాఖ నగరం అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పదవీకాలంలో ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ప్రజలు గుర్తించారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన నగరం గనుక ఖర్చులేకుండా అక్కడ రాజధాని నడపవచ్చు అనే మాయమాటలతో ఆయన మోసం చేశారు. ఆ మోసాలకు తగ్గట్టుగానే.. ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి గట్టిగానే బుద్ధిచెప్పారు. ఆ పార్టీకి ఎక్కడా ఠికానా లేకుండా చేశారు.
జగన్ ద్రోహచింతన విశాఖ కార్పొరేటర్లకు కూడా అర్థమైంది. వారు ఒక్కరొక్కరుగా పార్టీని వీడి కూటమి పార్టీల్లో చేరిపోయారు. వారిని కట్టడి చేయడానికి, అడ్డుకోవడానికి ముగ్గురు మాజీ మంత్రుల్ని పురమాయించారు జగన్. ఎమ్మెల్సీలు, ఎంపీలు వెళ్లిపోయినా పట్టించుకోలేదు గానీ.. కార్పొరేటర్ల కోసం చాలా హైడ్రామాలు నడిపించారు. కానీ.. మెజారిటీ సభ్యులు కూటమి పార్టీల్లోకి వెళ్లిపోవడంతో.. వారి పాచిక పారలేదు. అంతిమంగా.. కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానం నెగ్గింది. జగన్ కు విశాఖ అన్నిరకాలుగానూ శోకమే మిగిల్చింది.
వైసీపీకి విశాఖ శోకం : హైడ్రామాలు నడిపించినా నోయూజ్!
Tuesday, December 9, 2025
