ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సారథ్యం చేతులు మారనున్నదా? ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరిని తప్పించి.. ఆమె స్థానంలో కొత్తవారిని నియమించున్నారా? ఆమె ప్రస్తుతం రాజమహేంద్రవరం ఎంపీగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ కార్యకలాపాలకు మరింత పూర్తి సమయం కేటాయించగల వ్యక్తుల కోసం పార్టీ అన్వేషిస్తున్నదా? అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర కమలదళంలో నడుస్తోంది.
అందరూ చిన్నమ్మగా పిలుచుకునే దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షపదవికి గడువు ముగుస్తోంది. ఇలాంటి సమయంలో ఆమెను కొనసాగిస్తారా? మరొకరిని నియమిస్తారా? అనే చర్చ సహజం. చాలామంది నాయకులు రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెంచుకుంటున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు ఉన్నారు. విష్ణువర్దన్ రెడ్డికి కూడా అధ్యక్ష పదవి మీద ఆశ ఉన్నది కానీ.. ఆయనను హైకమాండ్ పరిగణించకపోవచ్చునని సమాచారం. అదే సమయంలో.. గతంలో అధ్యక్షుడుగా చేసిన సోము వీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మరోమారు అధ్యక్ష బాధ్యతలు చేపట్డడం గురించి కూడా ఆయన ఉత్సాహంగానే ఉన్నారు.
అయితే భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం మాత్రం.. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు, బలోపేతానికి ఉపయోగపడే వారిని మాత్రమే ఈ పదవిలో నియమించాలని భావిస్తోంది. పైగా ఇంకో అర్హత కూడా చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం నడుస్తోంది. మూడు పార్టీలు కూటమిగా జట్టుకట్టి ఉండగా.. మూడింటిలో అతిచిన్న పార్టీ బిజెపినే. ఇలాంటి సమయంలో.. కూటమి నిర్ణయాలు తీసుకునేప్పుడు.. అటు చంద్రబాబునాయుడు, ఇటు పవన్ కల్యాణ్ లతో సమానంగా కూర్చుని చర్చలు జరిపేలా వారి స్థాయిగల వారే కావాలని కూడా చూస్తున్నారు. కేవలం వారితో సమానమైన స్థాయి ఉండడం మాత్రమే కాకుండా.. వారితో సఖ్యంగా ఉంటూ.. కూటమి స్నేహధర్మానికి విఘాతం కలగకుండా, అలాంటి దిశగా పార్టీ నాయకులను కూడా నియంత్రణలో ఉంచుకుంటూ నడిపించే వాళ్లు కావాలి.
ఆ కోణంలో చూసినప్పుడు దగ్గుబాటి పురందేశ్వరి కే కొంత ఎడ్వాంటేజీ ఉంది. ఆమెకు రెండు పార్టీల అగ్రనేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. పైగా పార్టీ ఆశిస్తున్నట్టుగా రాష్ట్రమంతా ముమ్మరంగా తిరుగుతూ పార్టీని బలోపేతం చేయగలనని ఆమె ఇదివరకే నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆమెనే కొనసాగించవచ్చునని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రమోషన్ ఇచ్చేట్లయితేనే చిన్నమ్మ మార్పు!
Friday, December 5, 2025
