జగన్ ప్రభుత్వం దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కాజేశారని లెక్క తేలిన లిక్కర్ స్కామ్ లో ఏదో జరిగిపోతుందని రెండు రోజులుగా రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసిన ఎంపీ విజయసాయిరెడ్డిని సాక్షిగా విచారణకు రావాలని సిట్ పిలిచిన నేపథ్యంలో.. ఆయన ఈ కుంభకోణంలో అసలైన సూత్రధారులందరి పేర్లను, అంతిమ లబ్ధిదారుల పేర్లను బయటపెట్టేస్తారని.. ఇక వారందరికీ దబిడిదిబిడే అని అంతా అనుకున్నారు. కానీ, విజయసాయి సిట్ విచారణకు వచ్చారు.. వెళ్లారు.. కొత్త అప్ డేట్ ఒక్కటి కూడా లేదు.
ఆల్రెడీ పోలీసులకు ఏ సంగతులైతే తెలుసో.. ఆల్రెడీ కసిరెడ్డి రాజ్ పై ఏ ఆరోపణలైతే గతంలో చేశారో.. అవే ఆయన ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్ నోట్ అన్నట్టుగా పునరుద్ఘాటించారు తప్ప.. కొత్త సంగతి ఒక్కటి కూడా బయటపెట్టలేదు. పైగా కీలక సూత్రధారుల్ని, పాత్రధారుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం కూడా కలుగుతోంది.
గురువారం నాడే విచారణకు వస్తానని సిట్ కు సమాచారం ఇచ్చిన విజయసాయి.. మధ్యాహా్నం తర్వాత.. శుక్రవారం వస్తానని కబురు పంపడంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తుల పేర్లు బయటపెట్టకుండా వైసీపీ పెద్దలు ఆయనతో బేరాలాడుతున్నట్టుగా గుసగుసలు వినిపించాయి. ‘వైసీపీతో విజయసాయి బేరాలాడుతున్నారా’ అంటూ ఆంధ్రావాచ్ ఓ ప్రత్యేక కథనం కూడా అందించింది. ఆ కథనంలోని అంశాలు నిజమే అనిపించేలా.. విజయసాయి కీలక నిందితుల పేర్లు ఒక్కటికూడా కొత్తగా బయటపెట్టకుండా జాగ్రత్తగా తన విచారణ పర్వం ముగించారు.
లంచాల సొమ్ము.. బిగ్ బాస్ కు అందాయా అని మీడియా వాళ్లు అడిగితే.. అసలు బిగ్ బాస్ అంటే ఎవరో మీకు తెలిస్తే నాకు చెప్పండి అని కౌంటర్ ఇచ్చారు. తన ఇంట్లో జరిగిన రెండు సమావేశాలకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారని అంటూనే.. ఆయన పాత్ర ఉందా అని అడిగితే.. ఆ సంగతి తనకు తెలియదని సిట్ కు చెప్పినట్లు వెల్లడించారు. అలాగే గతంలో జగన్ వద్ద ఓఎస్డీగా సేవలందించిన కృష్ణమోహన్ రెడ్డి, ఐఎఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి మీటింగుకు వచ్చారా? అంటే ‘తనకు గుర్తున్నంత వరకు లేదు’ అని ఆయన సిట్ కు చెప్పారట. ఈ సమాధానాలన్నీ గమనిస్తే.. విజయసాయిపై వైసీపీ ఆఫర్లు పనిచేసినట్టుగానే ఉంది.
విజయసాయి గతంలోనే రాజ్ కసిరెడ్డి ఈ స్కామ్ కు కర్త కర్మ క్రియ అని వెల్లడించారు. ఇప్పుడు దానినే మళ్లీ చెప్పారు తప్ప.. ఒక్క కొత్తపేరు కూడా జత చేయలేదు. విచారణలో వైసీపీ వారందరూ చెబుతున్నట్టుగానే.. తెలియదు, గుర్తులేదు ఫార్మాట్ నే ఆయన కూడా అనుసరించారు. ఇదంతా అనుమానస్పదమేనని పలువురు అనుకుంటున్నారు.
