ఏపీ రాజకీయాల్ని కొన్ని నెలలు లేదా వారాలుగా కుదిపివేస్తున్న అతిపెద్ద వ్యవహారం లిక్కర్ స్కామ్. రాజకీయాలన్నీ దానిచుట్టూతానే తిరుగుతున్నాయి. ఈ కీలక సమయంలో.. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. లిక్కర్ స్కామ్ లో సిట్ బృందం విచారణకు హాజరయ్యారు. సాక్షిగా హాజరయ్యేందుకు ఆయనకు సిట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.. సాక్షిగా ఆయన హాజరయ్యారు.. అంటూ ఆయన కేవలం ‘సాక్షి’ మాత్రమే అని ప్రొజెక్టు చేయడానికి చాలా ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉన్నది గానీ.. విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. విజయసాయిరెడ్డి మీడియాకు చెప్పిన మాటలను గమనిస్తే.. అసలు లిక్కర్ స్కామ్ అనేది పురుడు పోసుకున్నదే విజయసాయిరెడ్డి ఇంట్లోనే అని అర్థమవుతోంది.
మూడువేల కోట్ల రూపాయల ఈ కుంభకోణం ఆ తర్వాత ఎంతెంత విరాట్ రూపానికి ఎదిగినదో అందరికీ తెలుసుగానీ.. తొలుత మంత్రసాని పని చేసింది విజయసాయిరెడ్డే అని ఆయన మాటలను బట్టే అనిపిస్తోంది. ఎందుకంటే.. అసలు ఏపీలో లిక్కర్ పాలసీ అనేది ఎలా రూపొందించాలి.. ఏయే అంశాలు ఉండాలి.. ఎవరెవరు పాత్రధారులు, ఎవరు సూత్రధారులు, ఎవరు లబ్ధిదారులు ఇలాంటి వ్యవహారాలన్నీ రెండు దఫాలుగా జరిగిన భేటీల్లో ఖరారయ్యాయి. ఈ రెండు భేటీలు కూడా విజయసాయిరెడ్డి ఇంట్లోనే జరిగాయి. ఆ విషయం ఆయనే చెబుతున్నారు.
విజయసాయిరెడ్డి తాను సాక్షి అని బుకాయిస్తున్నారు గానీ.. ఆయన పాత్ర కూడా ఉన్నది గనుకనే సిట్ విచారణకు పిలిచినట్టుగా అనిపిస్తోంది. అయితే తన ఇంట్లోనే భేటీలు జరిగిన విషయాన్ని ఆయన దాచిపెట్టలేని పరిస్థితిలోనే పోలీసులతో వివరాలు వెల్లడించారు. ఎందుకంటే.. ఇదివరకే సిట్ విచారణకు హాజరైన బెవరేజెస్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, మరో అధికారి సత్యప్రసాద్.. విజయసాయి ఇంట్లో సమావేశాలు జరిగినట్టుగా వెల్లడించారు. వారి వాంగ్మూలాలను ముందు పెట్టుకుని సిట్ అధికారులు విజయసాయిని ప్రశ్నించారు. దానిని ఆయన ఒప్పుకున్నారు.
హైదరాబాదు జర్నలిస్టు కాలనీలోని తన ఇంట్లో మొదటి సమావేశం జరిగిందని.. దానికి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నట్టుగా ఆయన చెప్పారు. అలాగే విజయవాడలోని తన నివాసంలో రెండో సమావేశం జరిగిందని అన్నారు. ఆ సమావేశానికి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఎఎస్ అధికారి ధనుంజయ రెడ్డి వచ్చారా అని సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు, తనకు గుర్తున్నంత వరకు లేదని చెప్పినట్టుగా విజయసాయి మీడియాతో వెల్లడించారు.
మొత్తానికి లిక్కర్ పాలసీ విజయసాయి ఇంట్లో జరిగిన మీటింగుల్లోనే తయారైందన్నది ఖరారు అవుతోంది. విజయసాయి చెప్పిన పేర్లను బట్టి పోలీసులు మరికొందరిని కూడా విచారిస్తారని, మరికొందరిని విచారించిన తర్వాత.. విజయసాయి పాత్ర కేవలం సాక్షిగా మాత్రమే పరిమితం కాకపోవచ్చునని కూడా పలువురు అంచనా వేస్తున్నారు.
