విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గొలగాని వెంకటహరికుమారిపై శనివారం అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి చాలినంత బలం ఎన్డీయే కూటమికి ఆల్రెడీ సమకూరి ఉంది. అయిదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దింపుడు కళ్లెం ఆశలేమిటంటే.. తమ చెంత ఉన్న కార్పొరేటర్లు అసలు సమావేశానికి వెళ్లకుండా చేస్తే.. కోరంలేక అది రద్దవుతుందని! కూటమి నాయకులు కూడా దానికి విరుగుడు కోసమే ప్రయత్నిస్తున్నారు. కోరంకు అవసరమైన 74 మంది సభ్యులబలం వచ్చేదాకా చేరికల్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎంత ఘనమైన మెజారిటీతో విశాఖ కార్పొరేషన్ మీద వైసీపీ జెండా ఎగురగా.. ఇప్పుడు ఆ కార్పొరేటర్లు అందరూ ఆ పార్టీని ఎందుకు ఛీత్కరించుకుంటున్నారు. ఎందుకు వరుసగా వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు? అనేది కీలకమైన చర్చనీయాంశంగా ఉంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన మునిసిపల్ ఎన్నికలను అత్యంత అరాచకంగా నిర్వహించింది. తెలుగుదేశం, జనసేనలకు చెందిన వారు కనీసం నామినేషన్లు కూడా వేయడానికి అవకాశం ఇవ్వకుండా.. వారిని అడ్డుకుని, నిర్బంధించి.. కిడ్నాపులు చేయించి, దారికాచి కొట్టించి రకరకాలుగా అడ్డుకుని మొత్తానికి కార్పొరేషన్ తమది అనిపించుకుంది.
జగన్మోహన్ రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించారు గనుక.. విశాఖవాసులంతా ఆ పార్టీకి నీరాజనాలు పడుతున్నారనడానికి చిహ్నమే ఈ కార్పొరేషన్ దక్కడం అని టముకు కొట్టుకుంది. అయితే సార్వత్రిక ఎన్నికలు వచ్చిన సమయంలో విశాఖ వాసుల అసలు మనోగతం ఏమిటో బయటపడింది. ఎగ్జిక్యూటివ్ రాజధాని ముసుగులో .. వైసీపీ గూండాలు విశాఖలో సృష్టించిన అశాంతి, అభద్రత పట్ల అక్కడి ప్రజలు ఎంతగా రగిలిపోతున్నారో బయటపడింది. కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. నగరం ఆ పార్టీని ఎంతగా ఛీత్కరించుకుంటున్నదో కార్పొరేటర్లు అందరికీ అర్థమైంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రజలు అంతగా అసహ్యించుకునే వైసీపీలో కొనసాగడం తమ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరం అని అందరూ గ్రహించారు. తమంత తాముగా కూటమి పార్టీలకు సంకేతాలు పంపి.. ఆయా పార్టీల్లో చేరిపోయిన వారు అనేకులు. ఆ తర్వాత కొందరిని కూటమినేతలే మంతనాలతో చేర్చుకున్నారు. ఇప్పుడు వైసీపీ వగచి విచారించి లాభం లేదని ఆ పార్టీ వారే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి స్వయంకృతం వల్లనే.. విశాఖ వాసులను తన పాలనతో భయభ్రాంతులకు గురిచేసిన తీరు వల్లనే ఇప్పుడు ఆ నగరంలో పార్టీ భూస్థాపితం అయిపోతున్నదని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీని కార్పొరేటర్లు ఎందుకు ఛీకొడుతున్నారంటే..?
Friday, December 5, 2025
