జగన్ పాలన కాలం నాటి అతిపెద్ద కుంభకోణంగా అందరూ పరిగణిస్తున్న లిక్కర్ స్కామ్ అనేక ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. కేసులో నిందితుడిగా తన పేరు లేకపోయినప్పటికీ.. ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం కోర్టుకు వెళ్లి భంగపడ్డారు. నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నాలుగు నోటీసులు పంపినప్పటికీ.. ఇప్పటిదదాకా స్పందించకుండా.. పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. ఈ స్కామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ఆ ప్రభుత్వ కాలం నాటి ప్రముఖ వ్యక్తి విజయసాయిరెడ్డిని సాక్షిగా పిలిస్తే.. ఆ ఎపిసోడ్ రకరకాలుగా మారుతోంది. ఈ పరిణామాలను గమనిస్తే.. ఈ అవకాశాన్ని వాడుకుని విజయసాయిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులతో బేరాలకు దిగుతున్నారా? అనే అనుమానం పలువురికి కలుగుతోంది.
రాజ్ కసిరెడ్డి పరారీలో ఉన్న నేపథ్యంలో.. ఈ కుంభకోణం వెనుక కర్త కర్మ క్రియ అతనేనని గతంలో వ్యాఖ్యలుచేసిన విజయసాయిని సిట్ పోలీసులు సాక్షిగా పిలిచారు. 18న శుక్రవారం రావాలని వారు పేర్కొంటే.. ఆయన గురువారమే వస్తానంటూ సిట్ పోలీసులకు సమాచారం పంపారు. తీరా మధ్యాహ్నం 12 గంటల దాకా విచారణ నిమిత్తం అధికారులు ఎదురుచూసినప్పటికీ.. విజయసాయి మాత్రం రాలేదు. ఆరాతీస్తే.. అనివార్య కారణాల వలన ఇవాళ రాలేకపోతున్నానని.. నోటీసుల ప్రకారం శుక్రవారం విచారణకు తప్పకుండా హాజరవుతానని విజయసాయి చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. నోటీసుకంటెముందే గురువారమే వస్తానని ఆయన ముందే ఎందుకు చెప్పినట్టు.. ఆ తర్వాత రాకుండా మిస్ చేసి.. రాలేకపోతున్నానని శుక్రవారమే వస్తానని ఎందుకు మార్చినట్టు అనే అనుమానాలు రావడం సహజం.
విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు ఆయనతో టచ్ లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా విజయసాయిరెడ్డి ఇచ్చే వాంగ్మూలానికి చాలా విలువ ఉంటుంది కాబట్టి.. ఆయన పార్టీలోని ప్రధాన నేతల పేర్లు చెప్పకుండా ఉండేందుకు ఆయనను ప్రలోభపెడుతున్నట్టుగా సమాచారం. అయితే మూడువేల కోట్ల అవినీతి జరిగిన ఈ భారీ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అయిన ముఖ్యనేత పేరు బయటకు రాకుండా చూడడం కోసం పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డిని బతిమాలుతున్నట్టు, భారీ ఆఫర్లు పెడుతున్నట్టుగా తెలుస్తోంది.
ముఖ్యనేత విషయంలో విజయసాయి కొంత మెత్తబడినప్పటికీ.. ఇప్పటికే రాజ్ కసిరెడ్డితో ఆ పనులు చేయించిన తెరవెనుక సూత్రధారిగా ఉన్న నేతల పేర్లను బయటపెట్టకుండా ఉండనని విజయసాయి చెప్పినట్టుగా సమాచారం. ఇంతకూ ఆయన శుక్రవారం విచారణలో ఎలాంటి బాంబులాంటి విషయాలను బయటపెడతారో వేచిచూడాలి.
