ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. మొన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డి ఆ పార్టీని వదిలివేయడంతోపాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని ఇప్పుడు భర్తీ చేస్తున్నారు. ఈనెల 22 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే మూడవ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 9న ఎన్నిక జరుగుతుంది అని షెడ్యూల్ ప్రకటించారు. రాష్ట్ర శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం నామినేషన్ వేయడానికి తగినంత సంఖ్యాబలం కూడా లేని నేపథ్యంలో.. కూటమి ఈ ఎంపీ స్థానాన్ని పోటీ లేకుండా చేజిక్కించుకుంటుంది. అయితే కూటమిలోని మూడు పార్టీలలో ఈ సీటు ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరమైన చర్చగా మారుతోంది.
ఇటీవల మూడు రాజ్యసభ ఎంపీ స్థానాలను భర్తీ చేశారు. రెండు స్థానాలను తెలుగుదేశం తీసుకోగా మిగిలిన ఒక్క స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పోటీ చేసి గెలిచారు. వైసిపి ఎంపీగా ఉంటూ రాజీనామా చేసి, హఠాత్తుగా బిజెపిలో చేరి ఎంపీ అయ్యారు. ఆర్ కృష్ణయ్య అనుకోకుండా తెరమీదకు రావడం వలన.. రాజ్యసభలో ఎంట్రీ ఇవ్వడం గురించి ఎంతో కాలంగా ఆశ పెట్టుకున్న జనసేనకు భంగపాటు తప్పలేదు.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబును రాజ్యసభ ఎంపీగా పంపాలనే ఆలోచనతోనే ఉన్నారు. ఆ కారణం చేతనే నాగబాబు ఎన్నికల సమయంలో ఎక్కడా పోటీ చేయకుండా కేవలం పిఠాపురం ఎన్నికల వ్యవహారాలను సమన్వయం చేసుకుంటూ గడిపారు. అయితే తొలి విడతలో మూడు రాజ్యసభ ఎంపీ స్థానాలకు అవకాశం వచ్చినప్పుడు జనసేన మిస్సయింది. ఎంపీ అవకాశం తప్పింది గనుక నాగబాబును రాష్ట్ర క్యాబినెట్ లోకి తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టారు. అయితే రాజ్యసభలోకి ఎంట్రీ ఇవ్వాలనే జనసేన కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది.
ఇప్పుడు ఒక ఎంపీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. విజయసాయి రెడ్డి రాజీనామా వలన అనుకోకుండా వచ్చిన అవకాశం ఇది. ఈ ఒక్క ఎంపీ అవకాశాన్ని జనసేనకు ఇవ్వడం న్యాయంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ఇటీవల భర్తీ చేసిన మూడు స్థానాలలో ఒకటి దక్కించుకోవడం వలన భారతీయ జనతా పార్టీ నుంచి ఈ సీటు కోసం పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలా కాదు.
ఆ పార్టీ కోసం కష్టపడిన వారు ఎంపీ పదవిని ఆశించగల స్థాయిలో త్యాగాలు చేసిన వారు కష్టనష్టాలకు ఓర్చి పార్టీ అధికారంలోకి రావడానికి పాటుపడిన వారు అనేకమంది ఉన్నారు. వారందరూ కూడా ఈ ఒక్క సీటు కోసం పోటీ పడే అవకాశం ఉంది. కూటమి ధర్మాన్ని అనుసరించి జనసేనకు ఈ స్థానం కేటాయించేట్లయితే.. చంద్రబాబు నాయుడు వారందరికీ సర్ది చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్క ఎంపీ స్థానం కూటమిలో ఎవరికి దొరుకుతుంది అనేది చర్చనీయాంశంగా మారుతోంది.
రాజ్యసభ ఎంపీ పదవి వరించేది ఎవరిని?
Friday, December 5, 2025
