రెడ్డిగా మారినా.. జగన్ గుర్తించడం లేదు!

Friday, December 5, 2025

కాపు జాతి మొత్తానికి తానే ఉద్ధారకుడిని అని.. కాపు జాతి కులతిలకుడిని అని తనకు తాను భావించుకుంటూ.. చీటికీ మాటికీ కాపు ఉద్యమాల పేరుతో ఏదో ఒక రభస చేయడానికి ప్రయత్నిస్తూ ఉండే వ్యక్తి ముద్రగడ పద్మనాభం! చాన్నాళ్లుగా కాపు నాయకుడిగా మాత్రమే పార్టీ రహితంగా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చినప్పటికీ.. ఎన్నికలకు ముందు ఆయన జగన్ పంచన చేరారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడిస్తానని, అలా ఓడించలేకపోతే.. తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఆయన ఎన్నికల సమయంలో ప్రకటించారు. పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత.. మాట మీద నిలబడి.. తన పేరును పద్మనాభ రెడ్డిగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా మార్చుకున్నారు కూడా! ఆయన రెడ్డితనం పుచ్చుకున్నారు.. రెడ్ల పార్టీలోనే ఉన్నారు.. కానీ, ఆ పార్టీలోని రెడ్లు మాత్రం ఆయనను రెడ్డిగా గుర్తించడం లేదు. అందుకే ప్రజలకు, ప్రధానంగా కాపులకు ఆయనను చూస్తే జాలి కలుగుతోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.. సజ్జల మొత్తం కమిటీకి సారథ్యం వహిస్తారు. కాగా 33 మంది సభ్యులను నియమించగా. అందులో కేవలం అయిదుగురు రెడ్లు మాత్రమే ఉన్నారు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ, కీలక మైన స్థానాల్లో రెడ్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంటారని అంతా అంటూ ఉంటారు. కానీ.. ఈ 33 మంది జాబితాలో జగన్ సామర్థ్యం కంటె కులాల తూకం మాత్రమే ప్రధానంగా ఫాలో అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇందులో ఆయన అయిదుగురు రెడ్లకు చోటు ఇచ్చారు గానీ.. ముద్రగడ పద్మనాభానికి కాపుల కోటాలో అవకాశం ఇచ్చారు.

ఆయన రాజకీయ అడ్వయిజరీ కమిటీలో  చోటు కల్పించినందుకు 32 మంది బహిరంగంగా స్పందించకపోయినప్పటికీ.. ముద్రగడ పద్మనాభ రెడ్డి మాత్రం చాలా చాలా ఎక్కువగా స్పందించారు. ‘‘తమరు అభిమానంతో ప్రేమతో నన్ను పీఏసీలో మెంబరుగా నియమించారని టీవీలో చూశానండీ. చాలా సంతోషం అండీ. తమరు నా మీద పెట్టిన బాధ్యత మీరు అధికారంలో వచ్చేవరకు నా వంతు కృషితో త్రికరణ శుద్ధిగా కష్టపడతానండీ. పేదవారికి మీరే ఆక్సిజన్. ఈ దఫా తమరు అధికారంలోకి వచ్చిన తరువాత.. ఈ ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ క న్నెత్తి చూడని విధంగా పరిపాలన పదికాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండీ’ అని ఉత్తరం రాశారు.

ఆ ఉత్తరాన్ని ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెద్దపెద్ద అక్షరాలతో ముద్రించిన లెటర్ హెడ్ మీద రాసి పంపారు. పాపం.. ముద్రగడ తనను తాను రెడ్డిగా చాటుకోవడానికి ఆరాటపడుతున్నారుగానీ.. జగన్మోహన్ రెడ్డి ఆయనను కాపు గానే గుర్తిస్తున్నారని.. జనం నవ్వుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles