‘పార్టీలో ఉన్నవాళ్లే మనవాళ్లు.. పోయినవాళ్లందరూ చెడ్డోళ్లు’ అని జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా మేకపోతు గాంభీర్యపు మాటలు పలకవచ్చు గాక. కానీ.. ఆయన నాయకత్వం మీద నమ్మకాలు సన్నగిలి.. ఈ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు సున్నా అని భయపడి.. తమ దారి తాము చూసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన మరో ముఖ్యమైన నాయకుడు పార్టీకి గుడ్ బై కొట్లాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి, గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన చొక్కాకుల వెంకటరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ జగన్మోహన్ రెడ్డికి లేఖ పంపారు.
చొక్కాకుల వెంకటరావు.. వైసీపీని స్థాపించిన తొలినాళ్లలోనే ఆ పార్టీలో చేరారు. 013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, నార్త్ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చరేపట్టారు. 2014 ఎన్నికల్లో బిజెపి విష్ణుకుమార్ రాజు చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చొక్కాకుల కుటుంబానికి జగన్ పదవులు కట్టబెట్టారు. విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్ పర్సన్ గా చొక్కాకుల భార్య లక్ష్మికి తొలుత పదవి ఇచ్చారు. తర్వాత అదే సంస్థకు చొక్కాకుల వెంకటరావునే ఛైర్మన్ గా నియమించారు.
2014లో ఓడిపోయిన తర్వాత.. 2019లో పార్టీ గెలిచే హవా ఉన్నప్పుడు జగన్ వెంకటరావును పక్కన పెట్టి కమ్ముల కన్నపరాజును పోటీచేయించారు. ఆయన కూడా ఓడిపోయారు. 2024లో కూడా వెంకటరావు టికెట్ ఆశించారు గానీ.. జగన్ మళ్లీ కన్నపరాజు వైపే మొగ్గు చూపారు.2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వెంకటరావు పార్టీ కార్యక్రమాల విషయంలో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు.
పరిస్థితి ఎలా తయారైనదంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ లో కొనసాగినా కూడా.. ఆయనకు ఎమ్మెల్యే పదవి మళ్లీ ఏదో ఒకనాటికి దక్కుతుందనే గ్యారంటీ లేదు. ఆ మాటకొస్తే.. ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకమే లేకుండా పోయింది. పార్టీని అంటిపెట్టుకుని ఉంటే.. ఏదో ఒకనాటికి వారు తిరిగి అధికారంలోకి వస్తే.. నామ్ కేవాస్తే కంటితుడుపు నామినేటెడ్ పదవులు తప్ప.. మరో ప్రాధాన్యం దక్కదని వెంకటరావుకు స్పష్టంగా అర్థమైంది. దాంతో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల పార్టీ నాయకులకు నమ్మకం సడలుతోందని అనడానికి ఇది మంచి ఉదాహరణ. ఆయన తిరిగి పార్టీని అధికారం దిశగా నడిపించగలరనే ఆశ ఏ ఒక్కరిలోనూ లేకుండా పోతోంది. ఇతర పార్టీల్లోకి అవకాశం ఉంటే వెళదాం.. లేకపోతే రాజకీయాలే మానుకుందాం తప్ప.. వైసీపీలో మాత్రం వద్దని పలువురు అనుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
వైసీపీకి మరో దెబ్బ : ఎమ్మెల్యే కేండిడేట్ గుడ్ బై!
Monday, April 21, 2025
