కొలికపూడికి క్లారిటీ.. మౌనమే చంద్రబాబు ఆగ్రహం!

Saturday, December 13, 2025

‘అమరావతి రాజధాని కోసం రైతులు సాగించిన పోరాటంలో గట్టిగా పని చేశా’రనే ఏకైక సదభిప్రాయంతో కొలికపూడి శ్రీనివాసరావుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. పార్టీలో సీనియర్ల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా తిరువూరు ఎమ్మెల్యేగా ఆయనను బరిలోకి దించారు. తెలుగుదేశం పార్టీ పట్ల రాష్ట్రవ్యాప్తంగా అపరిమితమైన ప్రజాధరణ వెల్లువెత్తిన ఈ ఎన్నికలలో కొలికపూడి శ్రీనివాసరావు కూడా సునాయాసంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి అనేక రకాల వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ, పార్టీలో నాయకులతో సఖ్యత లేకుండా అధిష్టానానికి చికాకులు కలిగిస్తూ.. కొలికపూడి శ్రీనివాసరావు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన పట్ల చంద్రబాబు నాయుడు  ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో స్వాగతం చెప్పిన పార్టీ నేతల వరుసలో కొలికపూడి శ్రీనివాసరావు కూడా ఉన్నప్పటికీ.. ఆయనను మాత్రం పలకరించకుండా, పట్టించుకోకుండా, ఆయన నమస్కారాన్ని స్వీకరించకుండా చంద్రబాబు మౌనంగా ముందుకు వెళ్లడమే ఆయనలోని ఆగ్రహం తారస్థాయిలో ఉన్నదనడానికి నిదర్శనం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొలికపూడికి కూడా చంద్రబాబు నాయుడు కోపగించిన విషయంపై క్లారిటీ వచ్చిఉంటుందని, ఆయన తన పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

కొలికపూడి శ్రీనివాసరావు గెలిచిన నాటినుంచి నియోజకవర్గంలో అన్నీ వివాదాలే. లోకల్ పార్టీ లీడర్లీతో తగాదాలే. తానొక్కడినే చాలా పరిశుద్ధుడిని అన్నట్టుగా ఆయన అనుకుంటూ అందరినీ బద్నాం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇదివరకే చంద్రబాబు ఆయనను పలుమార్లు పిలిచి హెచ్చరించడం జరిగింది. ఇటీవల పార్టీ నాయకులతో గొడవలను కొలికపూడి పెద్దవి చేశారు. సస్పెన్షన్లు చేయకుంటే పార్టీని, ఎమ్మెల్యే పదవిని వీడుతానని ప్రగల్భాలు పలికారు. స్థానిక నాయకులతో వివాదంలోకి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని కూడా లాగే ప్రయత్నం చేశారు. తప్పులు చేస్తున్న తెదేపా నాయకులకు కేశినేని చిన్ని అండదండలు ఉన్నాయని అర్థం వచ్చేలా మాట్లాడడం ద్వారా.. కొలికపూడి చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించారు.

చంద్రబాబునాయుడు మాత్రం ఆయనతో మళ్లీ తాను మాట్లాడడం ఇష్టం లేక, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతోనే వ్యవహారం చక్కదిద్దమని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే బహిరంగ కార్యక్రమంలో తనను స్వాగతించడానికి వరుసలో నిల్చుని ఎమ్మెల్యే కొలికపూడి నమస్కరించినా కూడా చంద్రబాబు పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఆయన తీరు పట్ల ఎంతగా విసిగిపోయి ఉన్నారో చెబుతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles