జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పాటు సాగించిన పరిపాలన అంటేనే రాష్ట్రప్రజలకు గుర్తుకొచ్చేది ‘విధ్వంసం’ అనే పదం మాత్రమే. తన రాజకీయ ప్రత్యర్థుల మీద కక్షతో కొన్ని, అపరిమిత ధనదాహంతో కొన్ని విధ్వంసక కార్యకలాపాలను ఆయన అయిదేళ్లు నిరాటంకంగా కొనసాగించారు. అసలు ఆయన పరిపాలనే.. ప్రజావేదిక విధ్వంసంతోనే ప్రారంభం అయింది. అలాంటి జగన్ విధ్వంసక క్రతువులో పరాకాష్ట అనదగినది.. విశాఖ నగర పర్యావరణ శోభనిచ్చిన రుషికొండను ధ్వంసంచేయడం. అంతే కాదు.. ఆ విధ్వంస శకలాల్లో.. తన నివాసం కోసం, తన కూతుళ్ల నివాసం కోసం ప్రభుత్వ సొమ్ము 500 కోట్ల రూపాయలు తగలేసి మూడు భవంతులు కట్టించుకోవడం! అయితే ప్రజలు ఆయనకు తగిన శాస్తి చేశారు. ఆ భవంతుల్లో ఒక్కరోజైనా గడిపే అవకాశం లేకుండానే దిగిపోయారు. ఆయన దుర్మార్గ పరిపాలనకు, విధ్వంసక బుద్ధికి చెరగని ఆనవాలుగా రుషికొండ భవంతులు మిగిలిపోయాయి.
అయితే ఆ భవంతులను రాష్ట్రానికి ఆదాయవనరుగా మార్చేందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రద్ధ పెడుతుండడం గమనార్హం. రుషికొండ భవనాలను సద్వినియోగం చేసుకునేలా వచ్చే నెలలోగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబునాయుడు మంత్రి వర్గ సహచరులతో వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
మంత్రులు కూడా ఈ విషయంలో సలహాలు ఇవ్వాలని చంద్రబాబు అడిగినప్పుడు.. మంత్రులు రకరకాల సలహాలు చెప్పారు. పవన్ కల్యాణ్ ఆ భవనాల్లో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సూచించారు గానీ.. అది ఆచరణ సాధ్యం కాదని చంద్రబాబు వివరించారు. పయ్యావుల కేశవ్ మాత్రం.. ఆ భవంతులతో పాటూ.. ఖాళీస్తలాల్లో మరికొన్ని గదులను నిర్మిస్తే డెస్టినేషన్ వెడ్డింగులకు ఇవ్వచ్చునని సూచించారు. నిజానికి పెళ్లిళ్ల మార్కెట్ చాలా చాలా ఖరీదుగా మారిపోయిన ఈ రోజుల్లో డెస్టినేషన్ వెడ్డింగులకు కేటాయించడం అనేది మంచి ఆలోచనే అని పలువురు అంటున్నారు.
అయితే చంద్రబాబు మాత్రం.. ఎలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తొందరపడి ఏదో ఒక నిర్ణయానికి రావడం ఇష్టంలేదనే సంకేతాలు పంపుతూ.. ముందు మంత్రులందరూ ఆ భవంతులను సందర్శించాలని.. అప్పుడు ఏవిధంగా వినియోగించుకోవచ్చో అందరూ నిర్మాణాత్మక సూచనలు చేస్తే నిర్ణయం తీసుకుందామని ఆయన అన్నారు.
మొత్తానికి జగన్ మితిమీరిన స్వార్థపూరిత బుద్ధితో దుర్మార్గంగా ప్రభుత్వం సొమ్ముతో తనకోసం ప్యాలెస్ లు కట్టించుకుంటే.. ఆ దుర్మార్గానికి గొడ్డలిపెట్టులాగా.. ఎప్పటికీ బుద్ధి వచ్చేలాగా చంద్రబాబు సర్కారు.. వాటిని రాష్ట్రప్రభుత్వానికి ఆదాయవనరుగా మార్చబోతున్నది.
జగన్ దుర్మార్గాన్ని ఆదాయవనరుగా మార్చనున్న చంద్రబాబు!
Monday, April 21, 2025
