చంద్రబాబునాయుడు ఏ కొత్త పథకం గురించి ఆలోచన చేసినా, ఏ పనిచేస్తున్నా సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నీలిదళాలు విషప్రచారం కంటిన్యూ చేస్తుంటాయి. ప్రపంచం మొత్తం తలతిప్పి చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఇమేజీ పెంచేవిధంగా అద్భుతమైన రాజధానిని నిర్మించడానికి అమరావతి నగరానికి రూపకల్పన చేస్తోంటే.. జగన్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. ఒక కులానికి మేలు చేయడం కోసం చంద్రబాబు చేస్తున్న వ్యాపారంలాగా ఆ ప్రాజెక్టును అభివర్ణించడం అత్యంత చవకబారుతనం అని ప్రజలు గుర్తించారు. అలా చంద్రబాబు ఏం పని చేసినా.. దానికి కులం రంగు పులమడానికి, కులానికి మేలు చేయడానికే చేస్తున్నారని అనడానికి వైసీపీ దళాలు ప్రయత్నిస్తుంటాయి. అలాంటి వారి నోర్లు మూయించేలా చంద్రబాబు సర్కారు తాజాగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది.
విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోస్ నిర్మించడం కోసం గతంలో వారికి 34.44 ఎకరాల స్థలం కేటాయించారు. సినిమా పరిశ్రమ ఏపీలో విస్తరించడానికి వేళ్లూనుకోవడానికి చేసిన భూ కేటాయింపులు ఇవి. కాగా ఈ భూములను కేవలం సినిమా స్టుడియోల నిర్మాణం, తత్సంబంధిత అవసరాల కోసం మాత్రమే వాడాలనేది నిబంధన. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో అరాచకదళాల కన్ను ఈ రామానాయుడు స్టుడియో భూములపై కూడా పడింది. ఆ భూములను కూడా తామే దక్కించుకోవాలనుకున్నారు. ఆల్రెడీ వారికి కేటాయింపులు జరిగి ఉన్నాయి గనుక.. తెరవెనుక నుంచి చక్రం తిప్పుతూ.. ఒత్తిడులు పెంచినట్లు పుకార్లున్నాయి. మొత్తానికి ఆ స్థలంలో 15.17 ఎకరాల భూమిని ఇళ్ల లేఅవుట్ వేసి, రియల్ ఎస్టేట్ వెంచర్ గా వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రామానాయుడు స్టుడియోస్ తరఫున జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్లాయి. అక్కడినుంచి అనుమతులు రాగానే.. ఆ స్థలంలో వీలైనంత తాము బినామీలుగా దక్కించుకోవాలనేది అప్పటి వైసీపీ పెద్దల కుట్ర! అయితే అనుమతులు వచ్చేలోగానే.. తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి ప్రభుత్వం కేటాయించిన భూమిని దానికోసం కాకుండా.. ఇతర ప్రయోజనాల కోసం వాడేట్లయితే ఆ కేటాయింపులు రద్దు చేయాలనే సుప్రీం కోర్టు తీర్పును ఉదాహరిస్తూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈలోగా.. భూమార్పిడిని అనుమతించవద్దని కోరుతూ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
తాజాగా కూటమి ప్రభుత్వం కత్తి ఝుళిపించింది. రియల్ ఎస్టేట్ కోసం మార్చదలచుకున్న 15.17 ఎకరాల భూమి కేటాయింపులను ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలంటూ షోకాజు నోటీసులు ఇవ్వాలని కలెక్టరును ఆదేశించారు. ఈ చర్యతో ప్రభుత్వం నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటివారిమీదనైనా కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందని, తన పర భేదాలు చూడదని ప్రజలకు అర్థమవుతోంది. ఈ షోకాజు ద్వారా చంద్రబాబునాయుడుకు కులం రంగు పులిమే వారి నోర్లకు కూడా తాళాలు పడతాయని అందరూ అనుకుంటున్నారు.
కులం రంగు పులిమేవాళ్ల నోర్లకు తాళాలు ఇలా!
Monday, April 21, 2025
