మంత్రి వర్గ సమావేశం నిర్వహించిన తర్వాత.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సహచరులకు ఒక గొప్ప దిశానిర్దేశం చేశారు. కేబినెట్ భేటీ తర్వాత.. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో ఆయన ప్రజాప్రతినిధులు పల్లెనిద్ర చేయాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో ఖచ్చితంగా పల్లెనిద్ర చేయాలని, నెలలో నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చంద్రబాబునాయుడు ఆదేశించడం విశేషం. ఒకసారి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు.. మళ్లీ ఎన్నికలు వచ్చేదాకా.. మొహం చాటేసి తిరుగుతూ ఉంటారనే జనం నానుడిని అబద్ధం చేస్తూ.. ప్రజలు ప్రతి వారం ఒక పల్లెలో నిద్ర చేయాలంటూ చంద్రబాబునాయుడు పురమాయించడం చాలా గొప్ప సంగతి. ఈ కార్యక్రమాన్ని.. కూటమి పార్టీల నాయకులందరూ చిత్తశుద్ధితో అమలు చేస్తే గనుక.. ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ప్రజలు అంటున్నారు.
సాక్షాత్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రుల సహా నెలలో నాలుగురోజులు పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొంటే గనుక.. ఖచ్చితంగా అక్కడి ప్రజలతో వారు మమేకం అవుతారు. ఎన్నికల ప్రచార సమయంలో వారి దృష్టికి వచ్చే అంశాల కంటె ఎక్కువగా గ్రామాల్లోని సమస్యలు, ప్రజల కష్టాలు వారి దృష్టికి వస్తాయి. పల్లెనిద్ర అంటే.. పొద్దు గుంకిన తర్వాత వెళ్లి పడుకుని, తెల్లారగట్ల నిద్రలేచి వెళ్లిపోవడం కాదు. ఒక రోజంతా అలా ఒక గ్రామ ప్రజలతో గడిపితే అనేక అంశాలు వారికి తెలుస్తాయి. వారానికి ఒకగ్రామం అంటే.. ఒక ఏడాదిలో కనీసం యాభై గ్రామాలను వారు కవర్ చేయగలుగుతారు. రాబోయే నాలుగేళ్ల పదవీకాలంలో.. ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు 200కు పైగా గ్రామాలను కవర్ చేయడం సాధ్యం అవుతుంది. వారి దృష్టికి సమస్యలు తెలుస్తాయి. వ్యక్తిగత పూనికతో కనీసం సగం పావు వంతు సమస్యలను పరిష్కరించినా సరే.. ప్రజల్లో వారికి అనన్యమైన కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి.
చంద్రబాబునాయుడు చెప్పిన పల్లెనిద్ర అనేది ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి.. గొప్ప మార్గం అవుతుంది. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు తెలియజెప్పడానికి ఇది ఉపయోగపడుతుందని చంద్రబాబు అంటున్నారు.
కేవలం ప్రజాప్రతినిధులు పల్లెలో నిద్రించడం మాత్రమే కాదు. అక్కడి ప్రజలతో మమేకం కావడం మాత్రమే కాదు. నాయకులు వస్తున్నారంటే.. వారితో పాటు అధికారులందరూ కూడా గ్రామానికి వస్తారు. దీనివల్ల ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలతో ఎదురవుతున్న కష్టాలన్నీ అందరి దృష్టికి వస్తాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గడపగడపకు వైసీపీ పేరుతో చివరి ఏడాదిలో ఓ కార్యక్రమం ఉరుకులు పరుగుల మీద నిర్వహించారు. ప్రభుత్వం చేసిన మేలు అంటూ డప్పుకొట్టుకున్నారే తప్ప ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం తక్కువ అయింది. పైగా చివరి ఏడాదిలో ప్రజల వద్దకు వెళ్లడం ఎన్నికల గిమ్మిక్కుగా కనిపించింది. అందుకే పార్టీ భ్రష్టు పట్టిపోయింది. చంద్రబాబునాయుడు తొలి ఏడాదిలోనే పల్లెనిద్ర ప్రతిపాదిస్తున్నారు. నాలుగేళ్ల పొడవునా ఈ కార్యక్రమం చేస్తూ పోతే.. రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.
బాబు ఆలోచన అమలైతే ప్రభుత్వానికి కీర్తి గ్యారంటీ!
Sunday, April 20, 2025
