ఎంపీ కేశినేని చిన్నిని ఇరికిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి!

Friday, December 5, 2025
అమరావతి రైతుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తూ పోరాడుతూ వచ్చిన కొలికపూడి శ్రీనివాసరావుకు వివాదాస్పద వ్యక్తిగా పేరున్నప్పటికీ.. అమరావతి పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబునాయుడు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. అయితే.. ఆయన తన వివాదాస్పద అలవాటును మాత్రం వీడడం లేదు. నియోజకవర్గంలో  రేగిన వివాదాన్ని తనకు రాజకీయ లబ్ధి ఉండేలా మలచుకుంటున్నారనే విమర్శలు ఉంటున్నాయి. పైగా నియోజకవర్గంలోని ఒక వివాదాన్ని విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ముడిపెట్టడానికి, ఆయనను కూడా బజారుకీడ్చడానికి కొలికపూడి శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తిరువూరు నియోజకవర్గం పరిధిలో ఏఎంసీ మాజీ ఛైర్మన్ రమేష్ రెడ్డి ఒక మహిళతో అసభ్యంగా ఫోనులో మాట్లాడినట్టుగా ఒక సంభాషణ ఆడియో లీక్ అయింది. దీనిని అనుసరించి.. సదరు రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొందరు గిరిజన మహిళలు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వచ్చారు. వారితో మాట్లాడుతూ కొలికపూడి రెచ్చిపోయారు. తెలుగుదేశం నాయకుడు రమేష్ రెడ్డిపై తమ పార్టీ 48 గంటల్లోగా చర్య తీసుకోకపోతే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేస్తానని ఆయన హెచ్చరిస్తున్నారు.  మహిళతో ఆయన ఫోన్ సంభాషణ జుగుప్సాకరంగా నడిచిందని, అలాంటివారిని నిలువునా పాతరేసినా తప్పులేదని, నేను పాల్గొనే కార్యక్రమాల్లో ఎక్కడైనా అతను కంటపడితే.. చెప్పు తెగేవరకు కొడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈతిట్లన్నీ ఒక ఎత్తు కాగా, రమేష్ రెడ్డి వ్యవహారాన్ని తాను పదిరోజుల కిందటే ఎంపీ కేశినేని చిన్ని దృష్టికి తీసుకువెళ్లినట్టుగా కొలికపూడి ఆరోపించడం విశేషం. రాష్ట్ర అధ్యక్షుడు సహా అందరికీ చెప్పానని.. పదిరోజులు దాటుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదో తెలియదని అన్నారు. ఎంపీ చిన్ని అతడిని కాపాడుతున్నట్టుగా రమేష్ రెడ్డి చెప్పుకుంటున్నారని.. రమేష్ రెడ్డి నిత్యం ఎంపీ ఆఫీసులోనే కూర్చుంటూ ఉంటారని, కొలికపూడి  ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం తమ పార్టీ నాయకుడు ఇరుక్కున్న వివాదాన్ని ఎంపీకి ముడిపెట్టేందుకు కొలికపూడి ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. దీనిని పార్టీ శ్రేణులు కూడా పూర్తిగా నమ్మడం లేదు. ఎందుకంటే.. గతంలో ఎమ్మెల్యేగా కొలికపూడి నియోజకవర్గంలో ప్రవర్తన గురించి పలు ఫిర్యాదులు వచ్చాయి. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన కూడా ఆ ఆరోపణల్లో ఒకటి. కాగా, ఆ సందర్భాల్లో చంద్రబాబు పురమాయింపు మేరకు ఎంపీ చిన్ని, కొలికపూడితో మాట్లాడి మందలించి పద్ధతిగా నడుచుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఎంపీ అనుచరుడి మీద ఆరోపణలు వచ్చేసరికి కొలికపూడి ఎంపీని ఇరుకున పెట్టడానికి కావాలనే రాద్ధాంతం చేస్తున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles