ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో కీలకమైన హామీకి కార్యరూపం ఇచ్చారు. చేనేత కార్మిక జీవితాల్లో పండుగవాతావరణాన్ని తీసుకువచ్చారు. చేనేత కుటుంబాలకు చెందిన ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్ లకు నెలకు 500 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇవ్వడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఈ హామీ కార్యరూపం దాల్చడం వలన.. రాష్ట్రంలో 93వేల చేనేత కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. అలాగే.. 10,534 పవర్ లూమ్ యూనిట్లకు కూడా లాభం చేకూరనుంది. చేనేతల కుటుంబాలను ఆదుకోవడంలో ఇది పెద్ద ముందడుగు అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
సోమవారం సమావేశం అయిన ఏపీ కేబినెట్ అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. వీటిలో అత్యంత ప్రధానమైనది.. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడం. వీటితో పాటు దాదాపు 40 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అమరావతి ప్రాంతంలో చేపట్టబోతున్న అనేక పనులకు సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ పనులకు టెండర్లను పొందిన సంస్థలకు ఒప్పంద పత్రాలను కూడా అందజేశారు.
బుడమేరు పొంగి విజయవాడ నగరానికి ఎంతటి విపత్తు వాటిల్లిందో అందరూ చూశారు. ఆ బుడమేరుకు కనీసం పూడిక తీయించకుండా అయిదేళ్ల జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యం వహించిన సంగతి కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో 38 కోట్ల రూపాయలతో బుడమేరుపై రక్షణ గోడలు నిర్మించడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే తాడిగడప మునిసిపాలిటీకి గత ప్రభుత్వం వైఎస్సార్ పేరును జోడించగా.. ఆ ఊరికి ఏమాత్రం సంబంధం లేని వ్యవహారం అంటూ ఆ జోడింపును కేబినెట్ తొలగించింది. కడప అనే పదానికి ఉండే విలువను గుర్తించకుండా.. జగన్ సర్కారు.. ఆ జిల్లా పేరులో ఆ పదాన్ని తొలగించేసింది. వైఎస్సార్ జిల్లాగా మాత్రమే నామకరణం చేసింది. దీనిని కూడా సవరిస్తూ.. వైఎస్సార్ పేరు ఉండడం సబబే గానీ.. కడప కూడా ఉండాల్సిందేనని.. పాత తరహాలో వైఎస్సార్ కడప జిల్లాగా నామకరణం చేశారు.
కేబినెట్ భేటీ తర్వాత అమరావతిలో అన్ని రకాల నిర్మాణాల ప్రారంభానికి, పునఃప్రారంభానికి సంబంధించి.. టెక్నికల్ వ్యవహారాలన్నీ ముగిసినట్టే. దీనికి సంబంధించి ఎల్ 1 బిడ్లను ఆమోదించడం, బిడ్డర్లకు పనులు అప్పగించడానికి సీఆర్డీయే కమిషనర్ కు అధికారం కట్టబెడుతూ తీర్మానం చేశారు. పనులు జరగడానికి సాంకేతిక వ్యవహారాలన్నీ పూర్తయినట్టే. ఏప్రిల్ నెలలో శంకుస్థాపనలు జరిగేలా.. ప్రధాని మంత్రి వెసులుబాటును బట్టి ముహూర్తం నిర్ణయించడం కేవలం లాంఛనమే అవుతుంది. అది జరిగిన వెంటనే అమరావతి పనులు శరవేగంగా జరుగుతాయని బిడ్డర్లకు ఇప్పుడే ఒప్పందపత్రాలు అందించేస్తుండడం వల్ల.. ముహూర్తంలోగా.. వారు అక్కడకు మెషినరీని, కార్మికుల్ని, నిపుణుల్ని తరలించుకుని అన్ని ఏర్పాట్లు చేసుకోగలరని అంతా ఆశిస్తున్నారు.
నేతన్నల కుటుంబాల్లే ఇది పండుగ రోజు!
Tuesday, March 18, 2025
