వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మందిని అసలు ఎమ్మెల్యేలుగా ఎందుకు ఎన్నుకున్నామా.. అని వారి వారి నియోజకవర్గాలకు చెందిన ప్రజలు విచారిస్తూ ఉండవచ్చు. ఒక్కరోజు కూడా సభకు వెళ్లకుండా.. వారు తమకోసం ఏం పనిచేస్తున్నారు గనుక.. వారిని ఎమ్మెల్యేలుగా గౌరవించాలని ఆయా ప్రజలు ఆవేదన చెందుతూ ఉండవచ్చు.ఆ పార్టీ ఎమ్మెల్యేల ధోరణిని.. ప్రజల తీర్పును అవమానించడంలో పరాకాష్ట కాగా.. మండలికి హాజరవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీల తీరు కూడా అందుకు భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. వైసీపీ ఎమ్మెల్సీలు టెక్నికల్ గా సభకు వస్తున్నారు.. అంతే, రావడం కాసేపు నానా గోల చేయడం.. అర్థం పర్థంలేని విమర్శలతో అరుపులతో విరుచుకుపడడం.. ఆ వెంటనే.. మంత్రులు ఏం చెబుతున్నారో కూడా పట్టించుకోకుండా.. జరిగే చర్చలకు సమాధానం ఇవ్వకుండా వాకౌట్ పేరిట పారిపోవడం అనేది వారికి అలవాటుగా మారింది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల పలాయనవాదానికి మంత్రి నారా లోకేష్ గట్టి పరిష్కారమే సూచిస్తున్నారు. మండలిలో మార్షల్స్ ను పెట్టి అయినా సరే.. వారు సభనుంచి వెళ్లకుండా చూడాలని, బయటకు వెళ్లిన వారిపై మార్షల్స్ ను ఉపయోగించి.. లోపలకు తీసుకురావాలని నారా లోకేష్ ఎద్దేవా చేస్తున్నారు.
2019-24 మధ్య జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు అంశంపై మండలిలో చర్చ జరిగింది. ఈ చర్చపై ప్రభుత్వం వివరణ ఇస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇదే అంశంపై చర్చకు బీఏసీలో వైసీపీ అంగీకరించింది. తీరా మండలిలో చర్చ జరిగే సమయానికి పలాయనం చిత్తగిస్తోంది అని లోకేష్ ఎత్తి చూపారు. ఆ పార్టీ సభ్యులు చర్చలో మాట్లాడేస్తారు.. తాము చెప్పదలచుకున్నదంతా చెప్పేస్తారు. తీరా మంత్రి వివరణ ఇచ్చే సమయానికి పారిపోతారు.. ఇది మంచి సంస్కృతి కాదు అని లోకేష్ విమర్శించారు.
వైసీపీ హయాంలో తెలుగుదేశం వారి మీద అనేక అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపే ప్రయత్నం చేశారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు పై తప్పుడు కేసులతో 53 రోజులు జైల్లో పెట్టడాన్ని గుర్తుచేశారు. తనమీద 23 కేసులు పెట్టారని అన్నారు. ఈ విషయాలన్నింటి మీద చర్చ జరగాల్సి ఉండగా.. మండలి లో వైసీపీ సభ్యులు వెళ్లిపోతున్నారని అన్నారు. గత ప్రభుత్వం కాలంలో.. మార్షల్స్ ను ప్రతిపక్ష సభ్యులను అణచివేయడానికి ఉపయోగిస్తూ సభను నడిపించారని, ఇప్పుడు.. అదే మార్షల్స్ ను ఉపయోగించి పలాయనం అవుతున్న వైసీపీ సభ్యులను సభలోకి తీసుకువచ్చి వారిని చర్చ వినేలా చేయాలని లోకేష్ ఆగ్రహించడం విశేషం.
వైసీపీ పలాయనవాదానికి లోకేష్ పరిష్కారమిదే!
Tuesday, March 18, 2025
