జగనన్న అధికారంలో ఉన్నంత కాలమూ.. తండ్రీ కొడుకులు అడ్డగోలుగా రెచ్చిపోయారు. రాష్ట్రాన్ని వనరుల్ని, ప్రజల ఆరోగ్యాన్ని, కనిపించని దొంగమార్గాల్లో వారి సంపదల్ని కొల్లగొట్టడానికి రకరకాల పద్ధతులు ఎంచుకుని.. వాటిని తండ్రీ కొడుకులు పంచుకుని.. యథేచ్ఛగా తమ దోపిడీపర్వాన్ని కొనసాగించారు. తమ మీద అతిగా ఆధారపడిన జగన్మోహన్ రెడ్డికి ఆకర్షణీయమైన వాటాలు సమర్పించుకుంటూ.. తమ దందాల పర్వాన్ని నిరాటంకంగా నడిపించారు. అలాంటి అరాచక తండ్రీ కొడుకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలలో ఇప్పుడు గుబులు పుడుతోంది. జగన్ రెడ్డి హయాంలో కొత్త పాలసీ పేరుతో విచ్చలవిడిగా సాగిన మద్యం కుంభకోణం కేసుల్లో తనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నదని, ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
గత ప్రభుత్వం కాలంలో.. ఇసుక, మద్యం వ్యాపారాల ద్వారా వేలకు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే సంగతి ప్రజలందరికీ తెలుసు. కనీసం డిజిటల్ లావాదేవీలకు అవకాశం కూడా ఇవ్వకుండా కేవలం నగదు మాత్రమే వసూలు చేస్తూ.. రసీదులు కూడా ఇవ్వకుండా.. ఈ రెండు రకాల వ్యాపారాలను నడిపించడం వెనుక.. అచ్చంగా దోపిడీ పర్వం మాత్రమే జరిగింది. ఈ వ్యాపారాలను నిజానికి తండ్రీకొడుకులు వాటాలు వేసుకున్నట్టుగా పర్యవేక్షించారనే సంగతి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటపడుతోంది. ఇసుక తవ్వకాల దగ్గరినుంచి అమ్మకాల వరకు .. తన బినామీ కంపెనీలకు కట్టబెట్టి వాటి ద్వారా వేల కోట్లరూపాయలు తండ్రి రామచంద్రారెడ్డి కాజేసే ప్రయత్నాలు చేయగా.. కొడుకు మిథున్ రెడ్డి లిక్కర్ వ్యాపారాన్ని పర్యవేక్షించే బాథ్యత తీసుకున్నారు. రాజ్ కసిరెడ్డిని తన తరఫు ఏజంటుగా వాడుకుంటూ.. అతని ద్వారా.. ప్రెవేటు యంత్రాంగాన్ని నిర్మించుకుని.. మద్యం కంపెనీలకు ఇండెంట్లు పెట్టడం దగ్గరినుంచి అనేక అక్రమాలు చేసినట్టుగా సీఐడీ పరిశోదనల్లో తేలింది.
ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబరు 23న సీఐడీ నమోదు చేసిన కేసులో తనను చేర్చినట్టు ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయని.. అందులో పేర్కొన్న ఆరోపణలన్నీ నిరాధారాలని.. తనను ఎఫ్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నదా గనుక.. బెయిలు ఇవ్వాలని ఆయన హైకోర్టును కోరారు.
మెలిక ఏంటంటే.. ఈ విషయంలో ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో తన పాత్రను ప్రస్తావించారని మిథున్ రెడ్డి అంటున్నారు. అవన్నీ అబద్ధాలని ఒక్వైపు అంటూనే.. అవన్నీ నిజాలనుకున్నప్పటికీ కూడా.. ఎఫ్ఐఆర్ లోని సెక్షన్లు తనకు వర్తించవని, ఏప్రిల్ 4 వరకు లోక్ సభ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున.. తను హాజరు కావడానికి వీలుగా ముందస్తు బెయిల్ కావాలంటున్నారు. తాను విచారణకు సహకరిస్తానని, తనను కస్టోడియల్ విచారణ చేయాల్సిన అవసరం లేదని.. అందుచేత బెయిలు కావాలని ఆయన అడగడం కొసమెరుపు. ఈ పిటిషన్, అందులో ఆయన పేర్కొన్న అంశాలు గమనిస్తే.. మిథున్ రెడ్డిలో అడుగడుగునా అరెస్టు భయం ఉన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు.
మిథున్ రెడ్డిలో అరెస్టు భయం!
Tuesday, March 18, 2025
