రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఎలాంటి ఎన్నికల హడావుడి కనిపించకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత నీరసంగా కనిపిస్తూ ఉంది. పైకి కనిపించకపోయినా.. వైఎస్ జగన్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అభ్యర్థులను మోహరించాలని ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఉభయగోదావరి జిల్లాలు,కృష్ణా- గుంటూరుల్లోని నాయకులకు ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ ఇస్తోంటే.. వారు అంతగా సుముఖత చూపించడం లేదని, దీంతో జగన్ తల పట్టుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ఇస్తున్న ఎమ్మెల్సీ ఆఫర్ ను వైసీపీ తమ్ముళ్లు వద్దంటే వద్దని తిరస్కరిస్తున్నారట.
జగన్ ఆలోచన సరళి ఇంకో రీతిగా ఉందని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత.. ఇదే జిల్లాల్లో గతంలో కూడా పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో వైసీపీ పోటీచేయకుండా తప్పుకుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్ని నిజాయితీగా నిర్వహిస్తుందనే నమ్మకం లేదని, అందువల్ల తాము పోటీచేయడం లేదని వారు అప్పట్లో బుకాయించారు. ఆడలేక మద్దెల ఓడు అన్న సామెత చందంగానే వైసీపీ వ్యవహారసరళిని ప్రజలు గుర్తించారు. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పు ఉంది.
ఈ ఏడు నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం భ్రష్టుపట్టిపోయిందని.. ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారని.. ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ ఢంకా బజాయించి గెలుస్తుందని.. తన 2.0 పరిపాలన నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని జగన్ పదేపదే చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదని అంత ఘాటుగా చెబుతూ.. పట్టభద్ర ఎన్నికల్లో పోలీచేయకుండా కూర్చుంటే తమ పరువు పోతుందని జగన్ ఆలోచిస్తున్నారు. అందుకే కొందరు నాయకులకు తన మనుషుల ద్వారా.. ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ పంపినా వారు సుముఖంగా లేరని తెలుస్తోంది.
ఎటూ గెలిచే అవకాశం లేని ఎన్నిక కోసం దన వనరులను ఖర్చు పెట్టే స్థితిలో లేం అని పార్టీ నాయకులు ఇండైరక్టుగా సంకేతాలు ఇస్తున్నారట. పార్టీ పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చే పక్షంలో పోటీచేయగలం అంటున్నారట. అయితే పార్టీనుంచి నిధులుసమకూర్చడం అనేది జగన్ కు ఇష్టం ఉండని వ్యవహారం అనికూడా అంచనా వేస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఎవరో ఒకరిని బరిలో దింపడానికి మంతనాలు సాగించి.. అందరూ వద్దని చెప్పిన తర్వాత.. కూటమి ప్రభుత్వం అన్యాయాలు చేస్తుంది గనుక.. నమ్మకం లేక తాము పోటీనుంచి తప్పుకుంటున్నాం అని జగన్ ప్రకటిస్తారని జనం భావిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఆఫర్ వద్దంటున్న జగన్ తమ్ముళ్లు!
Sunday, March 16, 2025
