ఏం జరుగుతోంది?: అంతర్మధనంలో వైసీపీ నేతలు!

Wednesday, December 10, 2025

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తీవ్రమైన గందరగోళం నెలకొని ఉంది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నారు. పార్టీలో నెంబర్ టూలాగా చెలామణీ అయిన, జగన్ తర్వాత అంతటి నాయకుడిగా ముద్రపడిన వేణుంబాక విజయసాయిరెడ్డి రాజీనామా చేసి వెళ్లిపోయారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి వంటి నాయకుడు స్థానికంగా ఉన్నా గానీ ఉపయోగం లేదు. ఆయన మామూలు నాయకులు ఎవ్వరికీ అందుబాటులో ఉండరనే పేరుంది. సోషల్ మీడియాలో రెచ్చిపోండి.. ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రశ్నించండి అంటూ రెచ్చగొట్టడం తప్ప.. పార్టీ నాయకులతో స్వయంగా టచ్ లో ఉంట.. వారిలో స్థైర్యం నింపే ప్రయత్నం ఆయన చేస్తారనే నమ్మకం కూడా ఎవ్వరిలోనూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తు ఏమిటి? తమ భవిష్యత్తు ఏమిటి? ఈ పార్టీలో ఉండడం మంచిదేనా? బయటకు వెళ్లిపోవాలా? పూర్తిగా రాజకీయాలు మానుకోవాలా? అనే రకరకాల సందేహాలు వైసీపీ నాయకులను ముప్పిరిగొంటున్నాయి. పైకి కనిపించడం లేదు గానీ.. పార్టీలో ఏదో జరుగుతోంది.. అని అందరూ అనుమానిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అంతర్మధనంలో నలిగిపోతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైన తర్వాత.. ఇప్పటికే ఆ పార్టీ నుంచి చాలా మంది కీలక నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్లిపోయారు. సిటింగ్ ఎంపీలు కూడా పదవిని కూడా వద్దనుకుని రాజీనామాలు చేశారు. సిటింగ్ ఎమ్మెల్సీలు కూడా పలువురు రాజీనామాలు చేశారు. కానీ వారందరూ వెళ్లిపోవడం ఒక ఎత్తు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడైన నాయకుడిగా.. జగన్ ప్రతి వ్యవహారాల్లోనూ ఆయన ఎడ్వయిజర్ గా, ఆయన బ్రెయిన్ గా జగన్ ప్రతికేసులోనూ ఏ2గా అందరికీ పరిచితులైన విజయసాయిరెడ్డి పార్టీ వీడి వెళ్లిపోవడం మాత్రమే మరొక ఎత్తు అని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

పార్టీ గెలుపోటములు పెద్ద విషయం కాదని, ఓడిపోయిన తర్వాత పార్టీని జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న తీరు అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నదని నాయకులు భయపడుతున్నారు. ఏ పార్టీకి విజయాలు శాశ్వతం కాదు.. గెలుపోటములు రెండూ సహజంగా ఎదురవుతూ ఉంటాయి. ఓడిపోయినప్పుడు పార్టీని సమర్థంగా నిర్వహించి.. మరోసారి విజయానికి సిద్ధం చేసేవాడే నిజమైన నాయకుడు అనిపించుకుంటాడు. చంద్రబాబునాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎదురుదెబ్బలు ఎన్ని తగిలినా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు గనుకనే.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు.. గదిలో కూర్చుని పోరాడాలంటూ ప్రకటనలు చేయడం, పిలుపు ఇవ్వడం తప్ప.. క్రియాశీలంగా వ్యవహరించలేని ఆయన నాయకత్వం.. పార్టీ వారితో వ్యక్తిగతంగా టచ్ లో ఉంటూ వారిలో స్ఫూర్తిని నింపే అలవాటు లేకపోవడం ఇవన్నీ పార్టీ నేతలను భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కు ఎంతో సన్నిహితుడైన విజయసాయిరెడ్డే వెళ్లిపోయారంటే.. ఇక అక్కడ ఎవ్వరికీ మనుగడ ఉండదని.. వీలైనంత త్వరగా పార్టీ వీడి వెళ్లిపోవడం బెటర్ అని నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles