పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. జగన్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న నాయకుడిగా అందరి మీద పెత్తనం చేస్తూ వచ్చిన విజయసాయిరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామా పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ ఓడిపోయిన కష్ట కాలంలో.. అది కూడా జగన్మోహన్ రెడ్డి విదేశాలలో ఉన్న సమయంలో విజయసాయి హఠాత్తుగా తన రాజీనామాను ప్రకటించడం మాత్రమే కాదు. ప్రకటననుంచి 24 గంటల వ్యవధిలో దాని ఆమోదం కూడా పూర్తియింది.
ఆ తర్వాత కొన్ని గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో.. తమ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీనామా గురించి స్పందించింది. ‘‘మీరు మా పార్టీకి బలమైన మూలస్తంభాల్లో ఒకరుగా ఉన్నారు. కష్టాలు విజయాలు రెండింటిలోనూ మీరు మాతో నిలబడే ఉన్నారు.’’ అంటూ ఆయనను ఆ ట్వీట్ లో ఆకాశానికెత్తేసింది. కానీ అసలు వైఖరి మాత్రం.. నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరించడమే అని ప్రజలకు అనిపిస్తోంది. ఎందుకంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారిక కరపత్రికలాగా ఉండుే సాక్షి దినపత్రికలో మాత్రం.. విజయసాయిరెడ్డి రాజీనామా పర్వం గురించి ఆయన రాజకీయ కేరక్టర్ ను సందేహించే రీతిలో కథనాలు ప్రచురించారు.
విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వలన ఎన్డీయే కూటమి పార్టీలకు మేలు జరుగుతుందని, ఆయన ఖాళీ చేస్తున్న రాజ్యసభ స్థానం ఎన్డీయే కూటమి పరం అవుతుందని, ఈ మేరకు ఆయన కేంద్రంలోని బిజెపి పెద్దలతో ముందుగా మాట్లాడుకున్న తరువాతనే.. అనుచిత ప్రయోజనాలు ఆశిస్తూ రాజీనామా చేస్తున్నారని సందేహాలు కలిగేలా సాక్షిలో కథనాలు ప్రచురించారు. సాక్షిలో వచ్చే విశ్లేషణలను.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని విశ్లేషణలుగా భావించడానికి అవకాశమే లేదు. అచ్చంగా జగనన్న మనసులో ఉన్న మర్మం గ్రహించే దానిని సాక్షి కథనాలుగా వారు అందిస్తూ ఉంటారు. ఆ పత్రికలో మాత్రం విజయసాయి శీలాన్ని శంకించేవిధంగా, ఆయన ప్రలోభాలకు లొంగినట్టుగా అర్థం వచ్చే విధంగా నర్మగర్భంగా వ్యాఖ్యలు ఉన్నాయి.
అదే పార్టీ అధికారిక ట్వీట్ వరకు వచ్చేసరికి.. ‘‘రాజకీయాలనుంచి వైదొలగాలనే మీ నిర్ణయానికి మేము గౌరవిస్తున్నాము. పార్టీకి మీరు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భవిష్యత్తులో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము’’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
మొత్తానికి విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది ఇక్కడితో ఆగదని.. ఇంకా అనేక మంది నాయకులు పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
విజయసాయిని.. ‘నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరిస్తూ..’
Monday, January 27, 2025