తెలుగు చిత్ర పరిశ్రమ సంచలనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. అయితే తాను లేటెస్ట్ గానే తన గాడి తప్పిన జీవితాన్నితిరిగి కొత్తగా మొదలు పెట్టబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఓ భారీ సినిమా కూడా ప్రకటించారు. కానీ ఈ మార్పు రాకముందు చేసిన కొన్ని పనులు మాత్రం తనకి ఇపుడు ఎఫెక్ట్ అవుతున్నాయి అని తెలుస్తుంది.
అలా ఓ కేసులో ఇపుడు రామ్ గోపాల్ వర్మ మూడు నెలలు జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మరిన్ని డీటెయిల్స్ లోకి వెళ్తే.. 2018 లో రామ్ గోపాల్ వర్మపై మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి వర్మ కంపెనీకి వ్యతిరేకంగా కేసు వేశారు. ఇరువురి నడుమ ఆర్ధిక లావాదేవీల విషయంలో వర్మ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో మిశ్రా కేసు ఫైల్ చేయగా 2022 లో వర్మ మధ్యంతర బెయిల్ కూడా తీసుకున్నారు.
కానీ కేసు నడుస్తున్నప్పటికీ మధ్యలో వర్మ హియరింగ్ లకు తరచూ గైర్హాజరు అవ్వడం కూడా చేయడంతో ఇపుడు ముంబై అంధేరి కోర్ట్ వారు నాన్ బెయిలబుల్ 3 నెలల జైలు శిక్ష విధించారు. సెక్షన్ 138 ప్రకారం తనకి మూడు నెలల జైలు శిక్షతో పాటుగా 3.72 లక్షల జరిమానా కూడా అంధేరి కోర్టు విధించింది. ఒకవేళ ఈ మొత్తం కానీ కట్టని పక్షంలో మరో మూడు నెలలు జైల్లో ఉండాల్సిందే అని తీర్పునిచ్చినట్టు తెలిసింది.