జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని నిందించి బురద చల్లడం ప్రారంభించేలోగా ఆయన విమర్శలు చేయడానికి ఉన్న దారులన్నీ మూసుకుపోయేలాగా కనిపిస్తోంది. సూపర్ సిక్స్ హామీల గురించి జగన్మోహన్ రెడ్డి చాలాకాలంగా నిందలేస్తూ వచ్చారు. అవన్నీ కూడా చంద్రబాబు గెలిచిన తక్షణం అమలులోకి తేవలసిన హామీలు అన్నంతగా ఓడిపోయిన తొలి నాటి నుంచి ఊదరగొడుతూనే ఉన్నారు. ప్రజలు పట్టించుకోకపోయినా పదేపదే ట్వీట్లు పెడుతూనే రోజులు నెట్టుకొస్తున్నారు. అలాగే ఇసుక ధరలు తమ ప్రభుత్వంలో ఉన్నట్లుగానే ఉన్నాయని.. లిక్కర్ ధరలు ఏమాత్రం తగ్గలేదని జగన్ ప్రజలను బుకాయించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనేక మద్యం కంపెనీలు తమ ధరలు తగ్గించడానికి అనుమతించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి బహుశా మింగుడు పడకపోతు ఉండవచ్చు.
‘ఇసుక ధరలు ఏం తగ్గాయి? ఉచిత ఇసుక అంటున్నారు గానీ ఎక్కడ దొరుకుతోంది.. మా ప్రభుత్వంలో ఉన్న రేట్లే ఇప్పుడు కూడా ఉంటున్నాయి’ అంటూ జగన్– చంద్ర సర్కారును ప్రశ్నిస్తూ ఉంటారు. ఎక్స్ లో పోస్టులు పెడుతూ ఉంటారు. మేం పరిపాలించినప్పుడు ఉన్న కంపెనీలే ఇప్పుడు కూడా ఉన్నాయి అవే బ్రాండ్ లిక్కర్ను సరఫరా చేస్తున్నా యి.. అదే ధరలకు అమ్ముతున్నారు.. ధరలు ఎక్కడ తగ్గాయి అంటూ లిక్కర్ విషయంలో కూడా ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఆయన ఎక్స్ వేదికగా సాహసిస్తుంటారు. అయితే లిక్కర్ ధరల పెంపు– తగ్గింపు అనేది కంపెనీలు ఇష్టారాజ్యంగా తీసుకునే నిర్ణయాలు కాదు.. అందుకు ప్రభుత్వం కూడా అనుమతించాల్సి ఉంటుంది!
గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన రోజుల్లో లిక్కర్ కంపెనీలు అడగకపోయినా సరే వాటి ధరలను విపరీతంగా పెంచడం ద్వారా అడ్డగోలు దోపిడీకి జగన్మోహన్ రెడ్డి తెర తీశారు. చంద్రబాబు నాయుడు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాం అని ఎన్నికల హామీతోనే ప్రజల ఎదుటకు వచ్చారు. అధికారం దక్కిన తర్వాత మాట నిలబెట్టుకున్నారు. ఇప్పటికే 10 బ్రాండ్ల లిక్కర్ తగ్గింపు ధరలతో లభ్యమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మాత్రం మిగిలిన కొన్ని కంపెనీల లిక్కరు బ్రాండ్లను దృష్టిలో ఉంచుకొని అదే బ్రాండ్లు అవే కంపెనీలు ధరలు ఎక్కడ తగ్గాయి.. అంటూ వంకర మాటలతో ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. కానీ పోటీ ప్రపంచంలో మిగిలిన కంపెనీలు కూడా అనివార్యంగా ధరలు తగ్గించుకోవాల్సి వస్తున్నది. ఎంఆర్పీ ఎక్కువగా ఉంచుకోవడం వలన అమ్మకాలు పడిపోతుండడంతో కొత్తగా ఆరు కంపెనీలు క్వార్టర్ బాటిల్ మీద 20 నుంచి 80 రూపాయల వరకు ధర తగ్గించడానికి అనుమతించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రభుత్వమే వారి విజ్ఞప్తులను రకరకాల న్యాయపరమైన అంశాల కారణంగా ఇంకా ఒక కొలిక్కి తీసుకురాకుండా ఉంది.
ఈ నేపథ్యంలో జిల్లాల్లోలో యాత్ర చేస్తూ ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తాను అని కొన్ని నెలలుగా ఊదరగొడుతున్న జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని నిందించే అంశాలే కరవయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సూపర్ సిక్స్ హామీల విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం కొన్నింటిని అమల్లోకి తేవడం.. కొన్నింటికి నిర్దిష్ట గడువును ప్రకటించడం జరిగింది! లిక్కర్ ధరలు కూడా ఇప్పుడు గణనీయంగా తగ్గుతున్నాయి. ఇక జగన్ తన యాత్రను మొదలెట్టెలోగా ఆయన మాట్లాడడానికి టాపిక్కులే ఉండవేమో.. ప్రభుత్వం మీద చల్లడానికి ఆయన కొత్త బురదను వెతుక్కోవాలేమో అని జనం నవ్వుకుంటున్నారు.