వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలహీనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ఆ పార్టీకి భవిష్యత్తు కూడా శూన్యం అనుకుంటున్న నాయకులు– ఒక్కరొక్కరుగా పార్టీని వీడి వెలుపలికి వెళుతున్నారు. ఇతర పార్టీలలో చేర్చుకోకపోయినా పర్వాలేదు.. ఇక్కడితో రాజకీయాలు చాలించుకుంటే క్షేమంగా ఉంటామని భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పార్టీని కాపాడుకోవడానికి– మళ్లీ తాము అధికారంలోకి వస్తామని ముందు పార్టీ నాయకులను నమ్మించడానికి.. జగన్ అనేక టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రదర్శించవలసి వస్తోంది. ‘రేపో మాపో తాము అధికారంలోకి వచ్చేస్తున్నాం’ అని ఆరు నెలలుగా చాటుకుంటున్న జగన్మోహన్ రెడ్డి రెండు లేదా నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వం మారిపోతుందని పగటి కలలు కంటూ ఉండడం తాజా పరిణామం!
వైయస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనడానికి పులివెందుల వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి హఠాత్తుగా అక్కడి డిఎస్పీ మురళి నాయక్‌పై ఆగ్రహం వచ్చింది. సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రరెడ్డి, ఎంపీ అవినాష్ పీఏ రాఘవరెడ్డి లను విచారిస్తుండమే మురళీ నాయక్ చేసిన నేరం! అంత్యక్రియల తరువాత తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో పార్టీ నాయకులు చెప్పిన సమాచారాన్ని విని ఆగ్రహించిన జగన్ డిఎస్పీని పిలిపించి ‘జాగ్రత్తగా ఉండా’లంటూ హెచ్చరించారు. రెండు లేదా నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వం మారిపోతుందని కూడా జగన్ తాను కలగన్న జోస్యాన్ని డిఎస్పి కి వివరించారు.
జమిలి ఎన్నికలకు కేంద్రం సుముఖంగా ఉన్న సంకేతాలు వచ్చిన నాటి నుంచి.. ‘రెండేళ్లలోగా జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయి.. ఈదఫా మన పార్టీ అసెంబ్లీ ఎన్నికలను గెలవబోతోంది’ అంటూ జగన్ పదేపదే డప్పు కొట్టుకున్నారు. తద్వారా పార్టీ నుంచి పారిపోతున్న నాయకులను మభ్యపెట్టి పార్టీలో కొనసాగేలా చేయడానికి జగన్ నానాపాట్లు పడ్డారు. కానీ జమిలీ ఎన్నికల బిల్లు అనేది పార్లమెంట్ సముఖానికి వచ్చేసరికి, దేశానికి అంతటికీ ఒక స్పష్టత వచ్చింది. ఇది చట్టరూపం దాల్చిన తర్వాత కూడా 2034 వరకు జమిలి ఎన్నికలు జరిగే అవకాశమే లేదని తేలిపోయింది. దెబ్బకు జగన్ డీలా పడ్డారు అయితే అంతలోనే తేరుకుని ఇప్పుడు మరింత పెద్దవిగా పగటి కలలు కంటున్నట్లు తెలుస్తోంది. అధికారులను బెదిరించడానికి రెండు నుంచి నాలుగు నెలల్లోనే ఎన్డీఏ సర్కారు మారిపోతుందని ఆయన హెచ్చరించడం తమాషాగా ధ్వనిస్తోంది. పదవి మీద ఆశ ఉండవచ్చు గాని.. అనాలోచితంగా ఇలాంటి అవగాహన లేని మాటలు మాట్లాడితే, కలలు కంటే ప్రజలు నవ్వుకుంటారని జగన్ తెలుసుకోవాలి!