జగన్మోహన్ రెడ్డి ప్రాపకంతో అప్పట్లో అడ్డదారుల్లో పెద్ద కొలువుల్లో కుదురుకున్నారు. అరాచకంగా వ్యవహరించారు. ఎడాపెడా దోచుకున్నారు. అవినీతి దందాలు సాగించారు. అన్ని పాపాలూ ఇప్పుడు పండుతున్నాయి. జగన్ కోసం పనిచేయడమే జీవితం అన్నట్టుగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వారి అవినీతి కార్యకలాపాలపై ఇప్పుడు కేసులు నమోదు అవుతున్నాయి.
జగన్ జమానాలో సీఐడీ చీఫ్ గా చేసిన ఎన్.సంజయ్ మీద ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు అయింది. ఆయన అప్పట్లో అగ్నిమాపక శాఖ డీజీ గా ఉండగా, సీఐడీ చీఫ్ గా ఉండగా రెండు కోట్ల రూపాయల దాకా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని విజిలెన్స్ లెక్క తేల్చింది. అగ్ని మాపక శాఖలో ఆన్లైన్ ఎన్వోసీ లు, సీఐడీ చీఫ్ గా ఎస్సీ ఎస్టీ లకు ట్రెయినింగులు పేరుతో.. రెండు కంపెనీలకు పనులు చేయకపోయినా బిల్లులు చెల్లించేసిన ఘనత ఎన్.సంజయ్ ది. చీఫ్ సెక్రటరీ అనుమతి తీసుకుని మరీ ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న సంజయ్ త్వరలోనే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కటకటాలు తప్పవని పలువురు భావిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లోనే మరొక మాజీ అధికారి కూడా ఉన్నారు. జగన్ జమానాలో ఐ అండ్ పీఆర్ కమిషనర్ గా చేసిన విజయ్ కుమార్ రెడ్డి అప్పట్లో సాక్షి సంస్థకు ప్రభుత్వ ఖజానా నుంచి దోచిపెట్టడమే తన జీవిత ఆశయంగా పనిచేశారని అపకీర్తి మూట గట్టుకున్నారు. రాష్ట్రంలోని అన్ని పత్రికలకు కలిపి సుమారు 850 కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తే.. అందులో 43 శాతం సుమారు 371 కోట్ల రూపాయల వరకు ఒక్క సాక్షికే దోచి పెట్టారు. సాక్షి వాళ్ళు కోరిన దానికంటే ఎక్కువ ధరకు వారి ప్రకటనల ధరను డిసైడ్ చేసి దొడ్డి దారిలో మేలు చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, తదితర సంస్థలకు అసలు ప్రకటనలు ఇవ్వకుండా.. ఇచ్చిన వారికి బిల్లులు పెండింగులో ఉంచడం చేశారు. కమిషనర్ హోదాలో అనేక లావాదేవీల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఆయన మీద కూడా ఇప్పుడు కేసు నమోదు అయింది. జగన్ కళ్ళలో ఆనందం కోసం సాక్షికి దోచిపెట్టినందుకు ఇపుడు ఆయన కూడా ఇపుడు విచారణ ఎదుర్కోబోతున్నారు. వీరి భవితవ్యం ఎలా తేలుతుందో చూడాలి.