తన అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే కు ఆగ్రహం వస్తే ఏం చేయాలి? పోలీసులు చేసిన అరెస్టు అక్రమం అని నిరూపించాలి. ప్రజల మద్దతు కూడగట్టాలి. న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. తన అనుచరుడు తప్పు చేయలేదని, అరెస్టు చేయడం మాత్రమే తప్పని ప్రజలకు చాటి చెప్పాలి. అప్పుడు అలాంటి నాయకుడికి ప్రజలలో గౌరవం దక్కుతుంది. అంతే తప్ప తన అనుచరుడిని అరెస్టు చేశారనే కక్షతో ప్రభుత్వ అధికారుల అంతు చూస్తాననే తరహాలో బెదిరించడం ఇప్పుడు రాజకీయాలలో చర్చినీయాంశం అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అని ప్రజలు భావిస్తున్నారు.
మేం ప్రతిపక్షంలో ఉన్నాం.. అధికార పార్టీ వాళ్లు పోలీసుల్ని అడ్డు పెట్టుకుని మమ్మల్ని అణిచివేస్తున్నారు. మామీద పోలీసుల్ని ప్రయోగిస్తున్నారు. అంటూ వైసీపీ నాయకులు నంగనాచి కబుర్లు చెబుతూ ఉండడం మనం చాలా సందర్భాల్లో గమనిస్తూనే ఉన్నాం. అయితే.. నిజానికి పోలీసులు వాళ్ల పని వాళ్లు చేస్తే కూడా.. వైసీపీ వారు దానిని సహించలేకపోతున్నారు.
అధికారంలో ఉన్నన్ని రోజులూ కన్నూమిన్నూ కానకుండా చెలరేగిపోయారు. తాము ఏం చేస్తే అదే రైటు, ఏం చెబితే అదే చట్టం అన్నట్టుగా వ్యవహరించారు. అంతా వారి ఇష్టారాజ్యంగా సాగింది. ఇప్పుడు ప్రజలు వారిని తిరస్కరించారు. దారుణంగా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా సరే వారికి వాస్తవం బోధపడినట్టుగా లేదు. ఇప్పటికీ తాము తప్పులు చేసినా సరే.. తమ జోలికి ఎవ్వరూ రారాదు అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్దనరెడ్డి వ్యవహారం అలాగే ఉంది.
ఆయన అనుచరుడిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఆయన లోకల్ సీఐ మరియు ఆర్ఐ మీద రెచ్చిపోతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ.. అత్యంత దారుణంగా బెదిరిస్తున్నారు. మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, తాను మళ్లీ ఎమ్మెల్యే అవుతానని.. ఈ సీఐ ఉద్యోగం ఊడగొట్టిస్తానని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి కోపం వస్తే మహా అయితే సస్పెండ్ చేయించగలరు తప్ప.. ఉద్యోగం ఊడగొట్టించడం అంత ఈజీ కాదని ఈ మాజీ మంత్రికి తెలిసినట్టుగా లేదు. ఈ సీఐ తన ఖాకీ చొక్కా వదిలేసి పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు వెంట, లోకేష్ వెంట తిరగాల్సి వస్తుందని ఆయన అంటున్నారు. ఈ రేంజిలో ప్రభుత్వాధికారుల్ని.. వారి విధులు చేసుకోనివ్వకుండా బెదిరించడం పట్ల ప్రభుత్వం సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.