అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం చాలా చురుగ్గా చర్యలు తీసుకుంటుండడం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడడం లేదు. ఇప్పుడు వాళ్లు ప్రజల మెదళ్లలోకి విషం చొప్పించడానికి కొత్త దారులు వెతుక్కుంటున్నారు. 60 వేల కోట్ల రూపాయలు ఒక్క అమరావతి మీదనే ఖర్చు పెట్టేస్తే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. జగన్ మాటలు విని ప్రజలు అంటున్నది ఒక్కటే.. తమ అయిదేళ్ల పాలనలో కేవలం ఒక్క లిక్కర్ దందాలోనే యాభై వేల కోట్ల రూపాయలకు పైగా కాజేశారు కదా.. తమ సొంత ఖజానాలు నింపుకున్నారు కదా.. ఇప్పుడు 60 వేల కోట్ల రూపాయల డబ్బు.. రాష్ట్ర ప్రతిష్ఠను ఎన్నో రెట్లు ఇనుమడింపజేసే రాజధాని ప్రాజెక్టు మీద పెడితే తప్పా అని అడుగుతున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో లిక్కర్ ఇసుక ప్యాపారాలను తమ అక్రమార్జనలకు రాజమార్గంగా మార్చుకున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడుపుతున్నాం అని చెబుతూ.. రసీదుల్లేకుండా, ఆన్ లైన్ డిజిటల్ చెల్లింపులు లేకుండా.. లిక్కర్ వ్యాపారంలో అతిపెద్ద దందా నడిపించారు. పిచ్చి బ్రాండ్లు అన్నింటినీ మార్కెట్లోకి తెచ్చి.. వాటికి విచ్చలవిడిగా విపరీతమైన ధరలు పెట్టి, ప్రజలు అలవాటు పడిన పాపులర్ బ్రాండ్లను నిషేధించి ఇంకో దందా నడిపించారు. మద్యం తయారీ సంస్థలను బినామీ పేర్లతో దక్కించుకుని.. తమ బ్రాండ్ల లిక్కరు మాత్రమే అమ్ముడయ్యేలా చక్రం తిప్పారు. ఇలాంటి అనేక రకాల అక్రమాల ద్వారా.. అయిదేళ్లలో యాభై వేల కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి కాజేశారని ఆరోపణలున్నాయి.
చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత.. లిక్కర్ వ్యాపారంలో ఎంత దోచేశారో లెక్కలు చెబితే.. అదంతా తప్పు లెక్కలని, కనీసం యాభైవేల కోట్లు దోచేశారని.. భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా గట్టిగా ఆరోపించారు. అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి 60 వేల కోట్ల డబ్బు రాజధాని కోసం ఖర్చు పెడుతుండడం చూసి ఓర్వలేకపోవడాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. ఒకవైపు అమరావతి స్వయంసమృద్ధి ప్రాజెక్టు అని.. అభివృద్ధి చేసిన తర్వాత.. ప్రభుత్వానికి వాటాగా దక్కే ప్లాట్లను విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో అప్పులు తీరుస్తామని మంత్రి నారాయణ చెబుతున్నప్పటికీ.. జగన్ దళాలు విమర్శిస్తుండడాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారు.