‘ఈ కేసు దర్యాప్తులో ఉన్నందుకు వల్ల మాట్లాడడం సరి కాదు’ అంటూనే బన్నీపై ఓ రేంజ్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. అంతే కాదు… జైలు నుంచి విడుదల అయ్యాక, బన్నీని పరామర్శించడానికి టాలీవుడ్ ప్రముఖులంతా బన్నీ ఇంటి ముందు క్యూ కట్టడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ”అల్లు అర్జున్‌కి కాలుపోయిందా, కన్నుపోయిందా, కిడ్నీ పాడైపోయిందా” అంటూ రేవంత్ చాలా వ్యంగ్యంగా విమర్శించారు.
బన్నీని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ సినిమా పెద్దలు వాపోయారని, తనని కూడా తిట్టారని, ఈ పెద్దలంతా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న పిల్లాడిని పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదంటూ ప్రశ్నలు కురిపించారు. మొత్తానికి బన్నీ వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదని ముఖ్యమంత్రి మాటలతో తెలిసిపోయింది. బన్నీ అరెస్ట్ అయ్యాక సైలెంట్ గా ఇంటికి వచ్చేస్తే ఏ గోల ఉండేది కాదేమో. కానీ సినీ ప్రముఖులంతా అల్లు వారింటికి బన్నీని పరామర్శించడానికి వెళ్లడం, దాన్ని మీడియా వారు లైవ్ టెలీకాస్ట్ చేయడం, అందరూ చూస్తుండగా హీరోలు నవ్వుకొంటూ హుషారుగా మాట్లాడుకోవడం.. చాలామందికి నిజంగానే ఓవరాక్షన్ అనిపించింది.
అప్పటి వరకూ బన్నీపై సానుభూతి చూపించిన వాళ్లు అంతాకూడా నెగిటీవ్ గా మాట్లాడడం మొదలెట్టారు. ఇప్పుడు సీఎం కూడా దీనిపై ప్రత్యక్షంగా స్పందించడం చూస్తుంటే… ప్రభుత్వం ఈ ఇష్యూని మరింత సీరియస్ గా తీసుకొన్నట్టు తెలుస్తుంది.