రాష్ట్రవ్యాప్తంగా నీటి సంఘాలకు శనివారం రోజున ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట ఎన్నిక వాయిదా పడింది. తతిమ్మా అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దాదాపుగా ఏకగ్రీవంగా మరియు ఏకపక్షంగా జరిగాయి. ప్రతిచోటా తెలుగుదేశానికి చెందిన వారే ఈ పదవులను దక్కించుకున్నారు. ప్రజల్లో తమకు అనుకూలంగా ఓట్లు పడే అవకాశం లేదని.. ఇలాంటి ఎన్నికల్లో అధికార పార్టీ వారి పట్ల ప్రజల్లో నమ్మకం కాస్త ఎక్కువగా ఉంటుందనే సత్యాన్ని ముందే గుర్తించిన జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల గోదాలోకి దిగకుండానే చేతులు ఎత్తేశారు. నీటి సంఘాల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ బహిష్కరిస్తున్నట్టుగా జగన్ ప్రకటించారు. దాంతో ఎన్నికలు చక్కగా జరిగిపోయాయి.
ఈ ఎన్నికల్లో అడుగుపెట్టినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేం అనే పిరికితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తెలివైన ఎత్తుగడ వేశారు. అధికార పార్టీ అధికార యంత్రాంగతాన్ని దుర్వినయోగం చేసి ఈ ఎన్నికలను చేజిక్కించుకోవాలని చూస్తున్నది గనుక, పోలీసులను ప్రయోగించి.. తాము పోటీచేయకుండా అడ్డుకుంటున్నది గనుక.. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
అయితే ఇప్పుడు ప్రజల మదిలో మెదలుతున్న సందేహం ఒక్కటే. జగన్మోహన్ రెడ్డి ఇదే సూత్రాన్ని త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అనుసరిస్తారా? అనేది! ఎందుకంటే కొన్నాళ్లకు సర్పంచి, జడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. స్థానిక ఎన్నికల్లో కూడా సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి కాస్త ఎడ్వాంటేజీ ఉంటుంది. అధికార పార్టీ వారిని గెలిపిస్తే పల్లెల అభివృద్ధికి వారు నిధులు తేగలరని, గ్రామాల్లో ఎంతో కొంత పనులు జరుగుతాయని ప్రజలు
సాధారణంగా నమ్ముతుంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన సాగిన రోజుల్లో అయితే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎలాంటి అరాచక వాతావరణాన్ని సృష్టించారో అందరికీ తెలుసు. తెలుగుదేశం వారిని కిడ్నాపు చేయడం, కొట్టడం, పోలీసులతో కిడ్నాపులు చేయించడం వంటివి జరిగాయి. ఇలాంటి అరాచకాలను చూసి.. అసలు అప్పటి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు తెదేపా కూటమి అదికారంలో ఉన్నది గనుక.. అప్పటి తమ అరాచకత్వానికి బదులు తీర్చుకుంటుందనే భయం జగన్ లో ఉంటుంది. ముందు జాగ్రత్తగా స్థానిక ఎన్నికల్లో కూడా బరిలోకి దిగకుండా.. అధికార పార్టీ అధికార దుర్వినయోగం గురించి బురద చల్లేసి జగన్ ఇంట్లో కూర్చుంటారని ప్రజలు నమ్ముతున్నారు.
స్థానిక’ ఎన్నికలకు కూడా ఇదే థియరీ ఫాలో అవుతారా?
Saturday, December 21, 2024