సైకోల తాట తీసేందుకు కొత్త రూల్స్ సిద్ధమవుతున్నాయ్!

Wednesday, December 18, 2024

సోషల్ మీడియాలో అసభ్యంగా నీచంగా ఎలా పడితే అలా పోస్టులు పెట్టేసి.. తాము రాజకీయ పార్టీల తరఫు సోషల్ మీడియా ఉద్యమకారులం, కార్యకర్తలం అటూ ముసుగులు వేసుకుని రెచ్చిపోతున్న వారికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెక్ పెట్టనుంది. సైబర్ నేరాలు, సోషల్ మీడియా ముసుగులో జరుగుతున్న నేరాలను కట్టడి చేయడానికి సరికొత్త చట్టం తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇందుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేయడానికి, నిబంధనలను రూపొందించడానికి నలుగురు మంత్రులతో చంద్రబాబునాయుడు ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటుచేశారు. హోంమంత్రి వంగలపూడి అనితతోపాటు, జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్, భారతీయజనతా పార్టీకి చెందిన మంత్రి సత్యకుమార్ ఈ సబ్ కమిటీలో ఉంటారు. విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ ఈ సబ్ కమిటీకి సారథ్యం వహిస్తారు.

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. ఇంట్లో ఆడవాళ్లను కూడా వదలకుండా అత్యంత జుగుప్సాకరమైన భాషలో పోస్టులు పెడుతున్నారని జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రులు ఎమ్మెల్యేల సహా ఎవ్వరినీ వదిలిపెట్టకుండా ఇలాంటి తప్పుడు పోస్టులతో చెలరేగిపోతున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడు స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ముసుగులో ఇలాంటి దుర్మార్గాలు మితిమీరిపోతున్నాయని అన్నారు. మనం తీసుకునే చర్యలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండాలని అంటూ.. ఒక కొత్త చట్టం తీసుకు వచ్చేందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పనకు ఈ సబ్ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు.

సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఇంకా పటిష్టంగా తయారుచేయాల్సిన అవసరం ఉందని,  టెక్నాలజీపై మంచి పట్టు ఉన్న అధికారుల్ని ఆ విభాగంలో నియమించాలని చంద్రబాబునాయుడు సూచించారు. క్రిమినల్స్ కు అడ్డుకట్ట వేయడానికి కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సి ఉందన్నారు.
మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వం సోషల్ మీడియా దుర్మార్గాలనుకట్టడిచేయడానికి కొత్త చట్టం తేబోతోంది. తాము ఉద్యమకారులం, పోరాటాలు చేస్తుంటాం.. ప్రాథమికహక్కులను వాడుకుని ఏది పడితే అది పోస్టు చేస్తుంటాం.. అంటూ తప్పుడు పనులు చేసే వారి తాట ఒలవడానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది. అనైతికమైన పోస్టు పెట్టాలంటేనే ఎవరైనా భయపడే పరిస్థితి వస్తుందని ఈ చట్టం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles