మంచు మోహన్ బాబు కుటుంబంలో పుట్టిన వివాదం ఇంకా ఎన్నెన్ని మలుపులు తీసుకోబోతోంది అనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ ఆసక్తికరమే. రెండు రోజుల కిందట తన ఇంటివద్ద జరిగిన తోపులాటలు, ఘర్షణల్లో గాయపడిన మంచు మోహన్ బాబు కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. రెండు రోజుల చికిత్స తర్వాత..గురువారం డిశ్చార్జి అయ్యారు. అయితే ఇప్పటికే మంచు మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదు అయి ఉంది. తన ఇంటివద్ద ఒక టీవీచానెల్ రిపోర్టరు మీద మైకుతో దాడిచేసినందుకు ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదు అయి ఉంది. ఆయనకు వ్యతిరేకంగతా జర్నలిస్టు సంఘాలు పెద్దపెట్టున నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన మోహన్ బాబు.. హత్యాయత్నం కేసు నుంచి, దాడి వివాదం నుంచి బయటపడడానికి ఒక మెట్టు దిగివస్తారా అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది.
టీవీ ఛానెల్ తమ రిపోర్టరు మీద జరిగిన దాడిని చాలా సీరియస్ గా తీసుకున్నది. మోహన్ బాబు మీద ప్రత్యేక బులెటిన్లతో ఆయన విలనీని చూపించడానికి ప్రయత్నిస్తున్నది. అయితే వివిధ వర్గాల నుంచి మోహన్ బాబుకు కొంత రాజీధోరణిలో వెళ్లాలనే సలహాలు అందుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. మోహన్ బాబు.. ఒక మెట్టు దిగి రావాలని అంటున్నారు. ఆరోజు ఆయన ఇంటి వద్ద ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆదాడి జరిగి ఉండవచ్చు గానీ.. రిపోర్టరును కొట్టడం మాత్రం తప్పే అని ఆయన అంటున్నారు. ఆరోజు పరిస్థితులు గురించి మాట్లాడి సమర్థించుకునే ప్రయత్నం చేయకుండా మోహన్ బాబు.. మీడియా ముఖంగా తాను చేసిన తప్పునకు క్షమాపణ కోరితే బాగుంటుందని ఆయన సలహా ఇస్తున్నారు. అలాగే.. మొహం మీద అయిన ఫ్రాక్చర్ కు సర్జరీ చేయించుకుని ఇంకా ఆస్పత్రిలోనే ఉన్న సదరు విలేకరిని కూడా మోహన్ బాబు వ్యక్తిగతంగా వెళ్లి కలిసి సారీ చెబితే బాగుంటుందని కూడా రాజాసింగ్ సలహా ఇస్తున్నారు.
నిజం చెప్పాలంటే మోహన్ బాబు హత్యాత్నం కేసులో బాగానే ఇరుక్కున్నారు. న్యాయపరంగా ఆయన తన తప్పులేదని నిరూపించుకోవడానికి చాలా కాలం పడుతుంది.. కష్టం కూడా. దాని బదులుగా ఆయన ఆవేశంలో చేసిన తప్పుగా చెప్పుకుని.. క్షమాపణ చెప్పడానికి సిద్ధపడితే ఆయనకే మేలు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మెట్టు దిగడానికి మోహన్ బాబు సిద్ధమేనా?
Thursday, December 12, 2024