పేర్ని నాని అనే పేర్ని వెంకట్రామయ్య- తనంత తానుగా వచ్చి అడ్డంగా ఇరుక్కుపోయా రు. అంతకంటే సింపుల్‌గా చెప్పాలంటే జగన్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం మీద అతి తరచుగా విరుచుకుపడుతూ ఉండే ఈ మాజీ మంత్రికి తనంత తానుగా వచ్చి కేసులో చిక్కుకోవడానికి మించి వేరే గత్యంతరం కూడా లేదు. తాను చేసిన నేరాన్ని వాళ్లంతగా గుర్తిస్తే తన భరతం పడతారని భయపడ్డారేమో.. తనకే పాపమూ తెలియదన్నట్లుగా.. అమాయకంగా ఒక లేఖ రాసి తప్పించుకోవచ్చు అని అనుకున్నారు. కానీ రిజల్ట్ మాత్రం ఆయన కోరుకున్న విధంగా లేదు. ప్రస్తుతానికి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వైసీపీ అక్రమాలలో ఒకటైన బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంలో పేర్ని నాని పాత్ర కూడా స్పష్టంగా తేలిపోయింది. ప్రభుత్వం కూడా ఆయన మీద సివిల్, క్రిమినల్ కేసులతో పాటు దాదాపు రెండు కోట్ల రూపాయల జరిమానాలు వసూలు చేసేదిశగా చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నది. పేర్ని నాని తనంగా బియ్యం స్మగ్లింగ్ కేసుల్లో ఇరుక్కోవడం అనేది జరిగిన క్రమం ఇలా ఉంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదికారంలో ఉన్నప్పుడు పేర్ని నాని మంత్రి. జగన్ కు అత్యంత విధేయుడైన మంత్రుల్లో ఒకడు. పవన్ కల్యాణ్ మీద విరుచుకుపడడంలో తన ముద్రతో జగన్ ప్రేమను సొంతం చేసుకున్నారు. 2020లో అధికారం తమ చేతుల్లో ఉన్నప్పుడు.. మచిలీపట్నంలోని తన గిడ్డంగులను పౌరసరఫరాల సంస్థకు లీజుకు ఇచ్చారు. పౌరసరఫరాల శాఖ అక్కడ ఉంచిన బియ్యానికి మూటకు నెలకు రూ.5 వంతున చెల్లిస్తుంది. కొన్ని వేల మెట్రిక్ టన్నులు నిల్వ చే్తారు గనుక.. లక్షల ఆదాయం వస్తుంది. ఆ లీజు ఎలాంటిదంటే.. ఆ గిడ్డంగుల నిర్వహణ పూర్తిగా యజమాని చేతిలోనే, ఆయన మేనేజర్లు, మనుషులతోనే నడుస్తుంటుంది. కానీ చాటుగా జరిగే దందా ఇంకోటి ఉంది.
నిర్వహణ అంతా తమ చేతుల్లోనే ఉన్నది గనుక.. పేర్ని నాని గిడ్డంగుల నుంచి బియ్యం బస్తాలను నేరుగా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న వైసీపీ నేతలకు పంపేయడం అలవాటుగా మారినట్టు ఇప్పుడు అధికారులు గుర్తిస్తున్నారు. కాకినాడ షిప్ లో పీడీఎస్ బియ్యం తరలుతున్న సంగతి బయటకు వచ్చిన తర్వాత.. పేర్ని నాని ముందుజాగ్రత్తగా తన గిడ్డంగుల్లో దాదాపు 3200 టన్నుల బియ్యం కనపడడం లేదని, ఆ విలువ చెబితే ఆ మొత్తం తాను చెల్లించేస్తానని ప్రభుత్వానికి ఒక లేఖ రాసుకున్నారు. అప్పుడు మేలుకున్న అధికారులు వెళ్లి స్వయంగా తనిఖీలు నిర్వహిస్తే దాదాపు 3700 టన్నులు గల్లంతైనట్టు గుర్తించారు. దాని విలువ దాదాపు 90 లక్షలుగా తేల్చారు. ఇలా జరిగినప్పుడు రెట్టింపు జరిమానా వసూలు చేస్తారు. ఆ ప్రకారం దాదాపు రెండు కోట్ల రూపాయల మేర పేర్ని నానికి జరిమానా వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దాంతోపాటు.న. గల్లంతైన బియ్యం కాకినాడ పోర్టు ద్వారా స్మగ్లింగుకు వెళ్లాయనే అనుమానాల నేపథ్యంలో సివిల్, క్రిమినల్ కేసులకు కూడా ఉపక్రమిస్తున్నారు. పేర్ని నానికి ఈ దెబ్బతో గడ్డు రోజులే అని అంతా అనుకుంటున్నారు.
పేర్ని నానికి అటు గోడదెబ్బ.. ఇటు చెంపదెబ్బ!
Thursday, December 12, 2024